Cabinet Expansion : తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్ ‘మంత్రివర్గ విస్తరణ’. రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు కోసం ఎంతోమంది ముఖ్య నేతలు ప్రస్తుతం పోటీపడుతున్నారు. పోటాపోటీగా పైరవీలు చేసుకుంటున్నారు. ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేనట్టేనని సీఎం రేవంత్ ప్రకటన చేయడంతో ఆ ప్రయత్నాల్లో ఉన్న నేతలంతా నిరాశకు లోనయ్యారు. క్యాబినెట్‌లోకి ఎవరిని తీసుకోవాలి అనే దానిపై తుది నిర్ణయం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌దే అని రేవంత్ తేల్చి చెప్పారు. దీంతో హస్తం పార్టీ పెద్దలు హస్తిన నుంచి కొత్త మంత్రుల పేర్లతో కూడిన చిట్టాను ఏ క్షణంలో తెలంగాణకు పంపుతారనే దానిపై ఉత్కంఠ మరింత పెరిగింది. మొత్తం మీద ఒక విషయం మాత్రం క్లియర్. మంత్రి వర్గ విస్తరణ అంశం అనే బంతి ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ కోర్టులో ఉంది.
Also Read :Oka Pathakam Prakaram : ఒక పథకం ప్రకారం మూవీ రివ్యూ..
హైకమాండ్ ఏం చేయబోతోంది ?
తెలంగాణలో మంత్రి పదవులు(Cabinet Expansion) కావాలని కోరుకుంటున్న నేతలు ఎక్కువ మందే ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరి తరఫున ఒక్కో సీనియర్ నేత పైరవీలు చేస్తున్నారు. ఈ అంశంపైనే కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయింది. పైరవీలు కుదరవని.. అర్హతలు, సామర్థ్యాలు కలిగిన వారిని తామే మంత్రులుగా డిసైడ్ చేస్తామని పార్టీ పెద్దలు తేల్చి చెప్పారు. రాష్ట్రంలో మంత్రులు అయ్యే స్థాయి కలిగిన ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారు ? అనేది కాంగ్రెస్ హైకమాండ్ స్వయంగా గుర్తించబోతోంది. ఈక్రమంలో తెలంగాణ పీసీసీ నెట్‌వర్క్ సహకారాన్ని తీసుకోనుంది. గురువారం రాత్రి జరిగిన సమావేశంలో ఈ అంశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీలకు కాంగ్రెస్ పెద్దలు తెలియజేశారు.
Also Read :CCL 2025 : నేడే CCL ప్రారంభం
ఈ సమావేశాల తర్వాతే..
తెలంగాణలో త్వరలోనే 6 మంత్రి పదవులను భర్తీ చేయనున్నారు. వీటిలో ఒకదాన్ని ముదిరాజ్ సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం ఉంది. మిగతా ఐదు మంత్రి పదవుల కేటాయింపు విషయంలోనే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల మధ్య విభేదాలు వచ్చాయని తెలుస్తోంది. సాక్షాత్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలోనే ఇదంతా జరిగిందట. దీంతో ఆయన శుక్రవారం రాత్రి రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. తొలుత దీపా దాస్‌మున్షీ, ఉత్తమ్, భట్టి, మహేశ్‌కుమార్‌గౌడ్ తమ అభిప్రాయాలను చెప్పారు. చివరగా కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ దాదాపు గంటన్నర పాటు సమావేశమయ్యారు. ఆ తర్వాతే ఇక మంత్రి పదవుల ఎంపిక అంశాన్ని తాము చూసుకుంటామని కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది.
మంత్రి పదవుల రేసులో..
మంత్రి పదవుల రేసులో చాలామంది నేతలు ఉన్నారు. అయితే ప్రముఖంగా వినిపిస్తున్న పేర్ల జాబితా ఇదీ.. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, శ్రీహరిముదిరాజ్, సుదర్శన్‌రెడ్డి, బాలునాయక్, రామచంద్రునాయక్, మురళీనాయక్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బాలునాయక్, ఎమ్మెల్యే వివేక్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు, ఎమ్మెల్సీ ఆమిర్‌అలీఖాన్, అజారుద్దీన్, షబ్బీర్‌అలీ, తదితరులు.