Cabinet Expansion: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం ఎంపిక మరోసారి వాయిదాపడింది. సోమవారం(మే 26న) రాత్రికల్లా దీనిపై ప్రకటన వెలువడాల్సి ఉండగా.. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో అందుబాటులో లేనందున ఈ ప్రక్రియను మే 30వ తేదీకి వాయిదా వేశారు. సోమవారం రోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీతో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ భేటీ అయ్యారు. ఇక సీఎం రేవంత్, మహేశ్‌కుమార్‌గౌడ్ కలిసి కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు. ఖర్గేతో ఈ నెల 30న సమావేశం ఉంటుందని, ఆ రోజున మళ్లీ ఢిల్లీకి రావాలని రేవంత్, మహేశ్‌లకు కాంగ్రెస్ హైకమాండ్ సూచించింది. దీంతో అదే రోజు మంత్రివర్గం, పీసీసీ కార్యవర్గ నేతల పేర్లను ఖరారు చేస్తారనే టాక్ వినిపిస్తోంది.
Also Read :Viral : ఫ్రాన్స్ అధ్యక్షుడిని చెంప దెబ్బ కొట్టిన భార్య..?
పలువురు సీనియర్లపై రాహుల్ ఫైర్
పీసీసీ రాష్ట్ర కార్యవర్గం ఎంపిక, కూర్పులో కొత్తతరం నేతలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని రేవంత్, మహేశ్‌కుమార్‌గౌడ్‌లకు రాహుల్‌గాంధీ(Cabinet Expansion) సూచించినట్లు సమాచారం. తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వెడ్మ బొజ్జు, పర్నికారెడ్డి, వంశీకృష్ణ, నాయిని రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వంటి యువతరం నేతలకు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవులు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. గతంలో సీనియర్ ఉపాధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులుగా నియమితులైన పలువురు సీనియర్ నేతలు కనీసం గాంధీభవన్‌లో కేటాయించిన గదులకు కూడా వెళ్లలేదని రాహుల్ గాంధీ చెప్పినట్లు తెలుస్తోంది. సీనియర్ అనే పేరుతో కాకుండా.. పనితీరే గీటురాయిగా పార్టీ పదవులను ఇవ్వాలని ఆయన చెప్పారట.
Also Read :Mysore Sandal Soap: మైసూర్ శాండిల్ సబ్బు పుట్టుకకు వరల్డ్ వార్ 1తో లింక్.. ఏమిటది ?
టీపీసీసీ కార్యవర్గంలో వీరికి ఛాన్స్
- పీసీసీ ఉపాధ్యక్షులుగా 35 మందిని నియమించనుండగా.. వారిలో ముగ్గురు లేదా నలుగురు ఎంపీలు, నలుగురు లేదా ఐదుగురు ఎమ్మెల్యేలకు చోటుకల్పించనున్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, నల్గొండ ఎంపీ రఘువీర్‌రెడ్డిలకు ఉపాధ్యక్ష పదవులు దక్కొచ్చని సమాచారం. జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ పేరును బీసీ కోటాలో ఇదే పదవికి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
- జిలాలవారీగా పార్టీ కోసం కష్టపడిన ముఖ్యనేతలకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్ష పదవులు ఇస్తారని సమాచారం.
- పీసీసీలో కీలకంగా భావిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులకు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి, మైనార్టీ నేతలు ఫహీం, ఫిరోజ్‌ఖాన్‌ల పేర్లను పరిశీలిస్తున్నారు. ఈ పదవులకు కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు పోటీపడుతున్నా, వారిని పక్కనపెట్టినట్లు తెలిసింది.
- గ్రేటర్ హైదరాబాద్ నుంచి మంత్రులు లేనందున పీసీసీ కార్యవర్గంలో కీలక పదవులు ఇక్కడి వారికి ఎక్కువగా ఇవ్వాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు.