Site icon HashtagU Telugu

Telangana Budget : ఎల్లుండి తెలంగాణ బడ్జెట్.. ఎక్కువ కేటాయింపులు ఈ రంగాలకే

Telangana Budget 2024

Telangana Budget : తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్‌ను ఈ నెల 25న(గురవారం) అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెడతారు. ఈసారి బడ్జెట్‌లో విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ రంగాలకు ప్రయారిటీ ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు స్పష్టంగా చెబుతున్నారు. ఈసారికి ఈ నాలుగు రంగాలకే కేటాయింపులు ఎక్కువగా ఉంటాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. రాష్ట్రానికి ఆదాయ మార్గాలు పరిమితంగా ఉన్నప్పటికీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలులో రాజీ పడే ప్రసక్తే లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఆరు గ్యారంటీల అమలు, ఉద్యోగాల భర్తీకి  కూడా బడ్జెట్‌లో ప్రయారిటీ ఉంటుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఆర్థిక వనరుల సమీకరణలో ఇబ్బందుల దృష్ట్యా ఈసారి మౌలిక సౌకర్యాల కల్పన, సాగునీటి ప్రాజెక్టులు, మూలధన వ్యయం తదితరాలకు ఎక్కువగా కేటాయింపులు ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join

Also Read :Israel Vs Gaza : దక్షిణ గాజా నుంచి వెళ్లిపోండి.. పాలస్తీనీయులకు ఇజ్రాయెల్ ఆర్డర్

  • రాష్ట్రంలోని రైతులకు చేరువయ్యే ప్రయత్నంలో కాంగ్రెస్ సర్కారు ఉంది. అందుకే రైతులను రుణ విముక్తులను చేసేందుకు ప్రభుత్వం రుణమాఫీని అమలు చేస్తోంది. దీనికి సంబంధించిన తొలిదశను జులై 18న లాంఛనంగా సీఎం ప్రారంభించారు. ఇప్పటికే రూ.లక్ష వరకు రుణం ఉన్న రైతులకు రూ.6,098 కోట్లను విడుదల చేశారు. ఈ నెలాఖరుకు రూ.లక్షన్నర వరకు రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. పంద్రాగస్టు నాటికి మొత్తం 60 లక్షల రైతు కుటుంబాలకు అప్పుల భారం లేకుండా చేస్తామని సీఎం రేవంత్ అంటున్నారు. ఆ మేరకు ఈసారి బడ్జెట్‌లో భారీ కేటాయింపులు ఉంటాయని అంచనా వేస్తున్నారు.
  • గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలుకు నోచుకోలేకపోయిన ఫసల్ బీమా యోజన, జల్‌జీవన్ మిషన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన లాంటి కొన్ని పథకాల కింద కేంద్రం నుంచి వచ్చే నిధులను సైతం వినియోగించుకోవాలని రేవంత్ సర్కారు భావిస్తోంది.రాష్ట్ర బడ్జెట్‌లో ఈ పథకాల అమలుపై ప్రకటన చేసే అవకాశం ఉంది.
  • ఈ ఏడాది మొదట్లో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన  ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌లో ఎస్సీలకు రూ.21,874 కోట్లు, ఎస్టీలకు రూ. 13,013 కోట్లు, బీసీలకు రూ. 8,000 కోట్లు, మైనారిటీలకు రూ. 2,262 కోట్లు కేటాయించారు. ఈసారి కూడా అదే ఒరవడిని కొనసాగించాలని రేవంత్ సర్కారు(CM Revanth) భావిస్తోంది.
  • పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు అవసరమైన నిధులను కేటాయించనున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతలతో పాటు కల్వకుర్తి, బీమా, కోయిల్‌సాగర్, డిండి, ఎస్సెల్బీసీ తదితర ప్రాజెక్టులకు కేటాయింపులు జరిగే ఛాన్స్ ఉంది.
  • భారీ ఖర్చుతో కూడిన ఇరిగేషన్ ప్రాజెక్టుల జోలికి ఈసారి తెలంగాణ ప్రభుత్వం వెళ్లే అవకాశం లేదు.

Also Read :2424 Jobs : రైల్వేలో 2,424 అప్రెంటిస్ పోస్టులు.. ఎగ్జామ్ లేకుండానే భర్తీ