Telangana BJP : ఇంటింటికీ బీజేపీ.. ఒక్కరోజే 35 లక్షల కుటుంబాలు టార్గెట్.. తెలంగాణ బీజేపీలో జోష్..

జూన్ 22 గురువారం నాడు భారీ కార్యక్రమానికి తెలంగాణ బీజేపీ శ్రీకారం చుట్టింది. రేపు ఒక్క రోజే 35లక్షల కుటుంబాలను కలవాలని బీజేపీ నేతలు టార్గెట్ పెట్టుకున్నారు.

  • Written By:
  • Publish Date - June 21, 2023 / 07:37 PM IST

కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ కాంగ్రెస్(Congress)లో కూడా జోష్ రావడంతో పలువురు నేతలు కాంగ్రెస్ కు క్యూ కట్టారు. దీంతో అప్పట్నుంచి తెలంగాణ బీజేపీ(Telangana BJP)ఒక్కసారిగా డీలా పడిపోయింది. దీంతో తెలంగాణాలో బీజేపీని తిరిగి జోష్ లోకి తీసుకురావడానికి పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా, అలాగే మోడీ(Modi) తొమ్మిదేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఇంటింటికి బీజేపీ అనే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

రేపు జూన్ 22 గురువారం నాడు భారీ కార్యక్రమానికి తెలంగాణ బీజేపీ శ్రీకారం చుట్టింది. రేపు ఒక్క రోజే 35లక్షల కుటుంబాలను కలవాలని బీజేపీ నేతలు టార్గెట్ పెట్టుకున్నారు. పోలింగ్ బూత్ అధ్యక్షుడి నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు అందరూ రేపు ప్రజల్లోనే ఉండనున్నారు. ఒక్కో బూత్ అధ్యక్షులు కనీసం వంద మంది కుటుంబాలను కలిసేలా కార్యాచరణ చేసుకున్నారు. రాష్ట్రస్థాయి నేతలంతా తమ తమ నియోజకవర్గాల్లో ప్రజల వద్దకు వెళ్లనున్నారు.

రేపు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ‘‘ఇంటింటికీ బీజేపీ’’ పేరిట ప్రజలతో మమేకం అవ్వనున్నారు బీజేపీ నాయకులు. నరేంద్రమోదీ పాలనలో జరిగిన అభివృద్ధిని, ప్రజలకు కలిగిన మేలును వివరించనున్నారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని చైతన్యపురి, విద్యానగర్ కాలనీల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించనున్నారు. అంబర్ పేట, గోల్నాకాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్ డివిజన్ లో డా. లక్ష్మణ్, హుజురాబాద్ లో ఈటెల రాజేందర్ పాల్గొననున్నారు. వారి వారి నియోజకవర్గాలలో జాతీయ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు అందరూ కూడా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఒక్కొక్కరు వంద కుటుంబాలను కలవాలని నిశ్చయించారు.

ఈ కార్యక్రమంతో బీజేపీ లీడర్స్ నుంచి కిందిస్థాయి కార్యకర్తలవరకు అందరిలోనూ జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు నాయకులు. మరి ఈ కార్యక్రమం తెలంగాణ బీజేపీకి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.

 

Also Read :  KTR vs Sharmila: చిన్నదొర చెప్పిన ఈ దశాబ్దపు పెద్ద జోక్ ఇదే