Hyderabad – Hot Seats : హైదరాబాద్ హాట్ సీట్లలో పొలిటికల్ సీన్

Hyderabad - Hot Seats : హైదరాబాద్ మహా నగరం నవంబరు 30న అసెంబ్లీ పోల్స్‌లో ఎలాంటి తీర్పు ఇవ్వబోతోంది ?

  • Written By:
  • Updated On - November 28, 2023 / 08:34 AM IST

Hyderabad – Hot Seats : హైదరాబాద్ మహా నగరం నవంబరు 30న అసెంబ్లీ పోల్స్‌లో ఎలాంటి తీర్పు ఇవ్వబోతోంది ? మహా నగరం ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు ? విశాలమైన హైదరాబాద్ నగరంలోని ఏయే ప్రాంతాల్లో ఏయే పార్టీ కింగ్‌గా నిలువబోతోంది ? ఇప్పుడు అంతటా దీనిపైనే చర్చ జరుగుతోంది. ఈనేపథ్యంలో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పరిధిలోని కీలకమైన అసెంబ్లీ స్థానాలలో ఎలాంటి పోటీ ఉందనే దానిపై ఓ లుక్ వేద్దాం..

We’re now on WhatsApp. Click to Join.

సనత్‌నగర్‌

సనత్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున ఏఐసీసీ మీడియా ఇన్‌ఛార్జి పవన్‌ ఖేరా సతీమణి కోట నీలిమ బరిలో ఉన్నారు. బీజేపీ తరఫున మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి పోటీలో నిలిచారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌‌దే పైచేయిగా కనిపిస్తోంది.

జూబ్లీహిల్స్‌

జూబ్లీహిల్స్‌‌లో కాంగ్రెస్‌ నుంచి క్రికెటర్‌ అజారుద్దీన్‌ బరిలోకి దిగారు.మైనారిటీ ఓట్లపై ఆయన ఆశలు పెట్టుకున్నారు.ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ హ్యాట్రిక్‌ విజయం కోసం ఎదురుచూస్తున్నారు. పీజేఆర్‌ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి బీఆర్ఎస్‌లో చేరడం గోపినాథ్‌కు ప్లస్ పాయింట్ కాబోతోంది.  ఇక్కడి నుంచి ఎంఐఎం కూడా అభ్యర్థిని నిలబెట్టడం అజారుద్దీన్‌కు మైనస్ పాయింట్ కాబోతోంది.

కంటోన్మెంట్‌(సికింద్రాబాద్)

సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున  ప్రజా గాయకుడు గద్దర్‌ కుమార్తె వెన్నెల పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ తరఫున దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె, కవాడిగూడ మాజీ కార్పొరేటర్‌ లాస్యనందిత మొదటి సారి పోటీ చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సాయన్న అకాల మరణంతో ఏర్పడిన సానుభూతి పవనాలు లాస్యనందితకు ప్లస్ పాయింట్‌గా మారే అవకాశం ఉంది.

ఖైరతాబాద్

ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ తరఫున పీజేఆర్‌ కుమార్తె పి.విజయారెడ్డి  పోటీ చేస్తున్నారు. గతంలో రెండుసార్లు కార్పొరేటర్‌గా గెలిచిన విజయారెడ్డి.. తన తండ్రి సెంటిమెంట్‌తో గెలుస్తానని అంటున్నారు.  బీజేపీ నుంచి చింతల రాంచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు. దానం నాగేందర్‌, చింతల రాంచంద్రారెడ్డి ఎన్నికలకు ముందు వరకు ప్రజలకు దూరంగా ఉన్నారనే ప్రచారం(Hyderabad – Hot Seats) ఉంది.

సికింద్రాబాద్‌

సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి డిప్యూటీ స్పీకర్‌ టి.పద్మారావు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆదం సంతోష్‌కుమార్‌, బీజేపీ అభ్యర్థిగా మేకల సారంగపాణి బరిలో ఉన్నారు. ఇక్కడ టి.పద్మారావుదే పైచేయిగా కనిపిస్తోంది.

చాంద్రాయణగుట్ట

చాంద్రాయణగుట్ట సెగ్మెంట్ నుంచి ఎంఐఎం తరఫున అక్బరుద్దీన్‌ ఒవైసీ పోటీ చేస్తున్నారు. 1999 నుంచి ఇక్కడ అక్బరుద్దీన్‌ గెలుస్తూ వస్తున్నారు. బీజేపీ నుంచి కౌడి మహేందర్‌, కాంగ్రెస్‌ నుంచి బోయ నగేశ్‌, బీఆర్ఎస్ నుంచి ముప్పిడి సీతారాంరెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే అక్బరుద్దీన్‌దే పైచేయిగా కనిపిస్తోంది.

గోషామహల్‌ 

గోషామహల్ నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యే రాజాసింగ్‌ పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌ కూడా బీజేపీలో చేరడం రాజాసింగ్‌‌కు ప్లస్ పాయింట్. బీఆర్ఎస్ నుంచి నందకిషోర్‌ వ్యాస్‌ బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ తరఫున మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు మొగిలి సునీతారావు పోటీ చేస్తున్నారు.

మహేశ్వరం

మహేశ్వరం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మంత్రి సబితా  ఇంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, బీజేపీ నుంచి అందెల శ్రీరాములుయాదవ్‌ పోటీ చేస్తున్నారు. ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ఉంది.

మేడ్చల్‌

మేడ్చల్ నుంచి  కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా తోటకూర వజ్రేష్‌యాదవ్‌, బీజేపీ అభ్యర్థిగా ఏనుగు సుదర్శన్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది.

మల్కాజిగిరి

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఈసారి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. బీజేపీ అభ్యర్థిగా ఎన్‌.రామచంద్రరావు పోటీ చేస్తున్నారు. ఇక్కడ మూడు పార్టీల మధ్య టఫ్ ఫైట్ జరుగుతోంది.

తాండూరు

తాండూరు నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి  పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా బి.మోహన్‌రెడ్డి బరిలోకి దిగారు. జనసేన పార్టీ నుంచి ఎన్‌.శంకర్‌గౌడ్‌ పోటీ చేస్తున్నారు. ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ఉంది.

Also Read: EC – Karnataka Ads : తెలంగాణ పత్రికల్లో కర్ణాటక ప్రభుత్వ యాడ్స్ ఆపేయండి :ఈసీ

Follow us