Election Notification : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఈరోజు రిలీజ్ కానుంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించేలా ఈ నోటిఫికేషన్‌లో ప్రకటన ఉంటుంది. ఈరోజు నుంచి ఈనెల 10 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారుల ఆఫీసుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆదివారం నామినేషన్లను స్వీకరించరు. నామినేషన్ వేసేందుకు మరో 7 రోజులు మాత్రమే టైం ఉంది. ఇప్పటికే పార్టీల నుంచి బీ ఫారాలు పొందిన అభ్యర్థులు ఈరోజు నుంచే నామినేషన్స్ వేయొచ్చు. ఒక్కో అభ్యర్థి ఒక్కో నియోజకవర్గం నుంచి గరిష్ఠంగా నాలుగుసెట్ల నామినేషన్లు వేయొచ్చు. ఒక అభ్యర్థి రెండుకు మించి నియోజకవర్గాల్లో పోటీ చేయరాదు. నామినేషన్ ప్రక్రియ, కార్యాలయం వెలుపల వీడియో, సీసీటీవీ ద్వారా రికార్డు చేస్తారు.
We’re now on WhatsApp. Click to Join.
అభ్యర్థులు ఈసీకి చెందిన సువిధ పోర్టల్ ద్వారానూ నామినేషన్లను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. ఆన్‌లైన్‌లో నామినేషన్ సమర్పించినా అభ్యర్థి ఆ ప్రతిపై సంతకంచేసి నిర్దిష్ట గడువులోగా రిటర్నింగ్ అధికారికి అందించాల్సి ఉంటుంది. విదేశాల్లో ఉండే భారతీయులు అక్కడి నుంచే నామినేషన్ దాఖలు చేస్తే అక్కడి భారత రాయబార కార్యాలయాలు, కాన్సుల్ కార్యాలయాల్లో ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ఈరోజు నుంచే 119 నియోజకవర్గాలకు 60 మంది ఎన్నికల వ్యయ పరిశీలకులు రంగంలోకి దిగనున్నారు. 39 మంది ఐపీఎస్ అధికారులను పోలీసు పరిశీలకులుగా నియమించారు. నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన ఉంది. ఎవరైనా నామినేషన్ పత్రాన్ని సరిగ్గా ఫిలప్ చెయ్యకపోతే, అధికారులు తిరస్కరిస్తారు. నామినేషన్ వేసి, వేరే కారణాలతో దాన్ని వెనక్కి తీసుకోవాలి అనుకునేవారు నవంబర్ 15లోగా ఆ పని చేయొచ్చు. నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్లను లెక్కిస్తారు. ఆ రోజున ప్రజా తీర్పు(Election Notification) తెలిసిపోతుంది.