Teenmar Mallanna New Party : తెలంగాణ రాజకీయాల్లో రోజురోజుకు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna)ను సస్పెండ్ చేయడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బీసీ హక్కుల కోసం తనదైన శైలిలో గళమెత్తుతూ వచ్చిన మల్లన్నపై కాంగ్రెస్ పార్టీ వేటు వేయడం వెనుక ఆంతర్యం ఏమిటనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా, ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, కులగణన సర్వే రిపోర్టును కాల్చిన వ్యవహారం తీవ్ర దుమారం రేపాయి. దీంతో, పార్టీ అధిష్టానం తీవ్ర అసంతృప్తికి లోనై ఆయనను పార్టీ నుంచి తొలగించింది. అయితే, మల్లన్న తన రాజకీయ భవిష్యత్ కోసం కొత్త పార్టీ (Teenmar Mallanna New Party) ఏర్పాటు చేసే అవకాశముందా? లేదా మరో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారా? అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
బీసీ నినాదంతో కొత్త పార్టీ స్థాపన..?
తీన్మార్ మల్లన్న గత కొంతకాలంగా బీసీ సంక్షేమాన్ని ముందుంచుకుని బలమైన వాదనలు చేస్తున్నారు. తెలంగాణలో ఉన్న అన్ని ప్రధాన పార్టీల్లోనూ బీసీలకు తగిన ప్రాతినిధ్యం లేదని, వారి హక్కుల కోసం బీసీలంతా ఐక్యంగా రావాలంటూ ఆయన పదేపదే చెబుతున్నారు. దీనికి తోడు బీసీ నేతలు ఆర్. కృష్ణయ్య, వట్టే జానయ్య కూడా అవసరమైతే బీసీలంతా కలిసి ఓ కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొనడం, మల్లన్న కూడా ఇదే మార్గాన్ని ఎంచుకునే అవకాశాన్ని బలపరుస్తున్నాయి. మల్లన్న సస్పెన్షన్ తర్వాత, అతని మద్దతుదారులు కొత్త పార్టీ పెట్టడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకముందే బీసీ సంఘాల నాయకులతో చర్చించి తీరాలని మల్లన్న భావిస్తున్నట్లు సమాచారం.
బీజేపీ లేదా టీడీపీ వైపు మల్లన్న మొగ్గు చూపనున్నారా?
తీన్మార్ మల్లన్న రాజకీయ ప్రస్థానం చూస్తే.. గతంలో బీజేపీలో చేరి, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల బయటకు వచ్చి ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ బీజేపీ వైపు అడుగులు వేయవచ్చన్న ప్రచారం ఊపందుకుంది. మరోవైపు తెలంగాణలో టీడీపీ తిరిగి పునాది వేయడానికి ప్రయత్నాలు చేస్తుండగా, పార్టీకి బలమైన నేతలు లేకపోవడంతో, మల్లన్నను ఆ పార్టీ ఆకర్షించే అవకాశముందంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టీడీపీ బీసీలకు అనుకూలమైన పార్టీగా పేరుపొందడం, రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఖాళీగా ఉండడం కూడా మల్లన్నకు కలిసొచ్చే అంశంగా పేర్కొంటున్నారు. మొత్తానికి తీన్మార్ మల్లన్న రాజకీయ అడుగుల గురించి తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూద్దాం మరి మల్లన్న ఏ నిర్ణయం తీసుకున్నారో..!