Site icon HashtagU Telugu

New MLCs : ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన ఇద్దరు నవీన్‌లు

New Mlcs

New Mlcs

New MLCs : కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్), నవీన్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. వారితో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. కాంగ్రెస్ నేత తీన్మార్ మల్లన్న ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాష్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి దీపాదాస్ మున్షీ, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కాగా, వరంగల్ – ఖమ్మం – నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన తీన్మార్ మల్లన్న గెలిచారు.

We’re now on WhatsApp. Click to Join

పాలమూరు రేవంత్ రెడ్డి అడ్డా కాదు :  ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి 

బీఆర్ఎస్ నేత నవీన్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాజీ మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్, తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నవీన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎమ్మెల్సీగా గెలిచేందుకు నన్ను ఆశీర్వదించిన కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజా ప్రతినిధులకు రుణపడి ఉంటాను. నా గెలుపులో వారి కృషి మరువలేనిది’’ అని నవీన్ రెడ్డి చెప్పారు. ‘‘నా విజయం తెలంగాణ అమరవీరులకు అంకితం. జూన్ రెండో తారీఖు రోజే నేను గెలిచాను.  నా విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం చేస్తున్నాను’’ అని ఆయన ప్రకటించారు.  ‘‘పాలమూరు రేవంత్ రెడ్డి అడ్డా కాదు.. అది కేసీఆర్ అడ్డా అని ప్రజలు నిరూపించారు’’ అని నవీన్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాగా,  మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి నవీన్ కుమార్ రెడ్డి గెలిచారు.

Also Read : NEET Exam : 1,563 మంది నీట్ అభ్యర్థుల గ్రేస్ మార్కులు రద్దు.. వారికి రీటెస్ట్ : కేంద్రం