Telangana TDP: తీన్మార్ మల్లన్న ఏ పార్టీలో చేరబోతున్నారు ? అనే దానిపై చర్చ జరుగుతున్న వేళ కీలక అంశం తెరపైకి వచ్చింది. ఆయన తెలంగాణ టీడీపీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం మొదలైంది. కొత్త పార్టీని ఏర్పాటు చేయడం కంటే గతంలో తెలంగాణలో ఒక ఊపు ఊపిన టీడీపీ జెండాతోనే జనంలోకి వెళ్లడం మంచిదని మల్లన్న భావిస్తున్నారట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో తెలంగాణలోని బీసీ వర్గాలు టీడీపీని బాగా బలపరిచేవారు. అందుకే తాను తీసుకున్న బీసీ నినాదానికి, టీడీపీ జెండాకు సరితూగుతుందని మల్లన్న అనుకుంటున్నారట. చేరిక అంశంపై పలువురు టీడీపీ పెద్దలు ఇప్పటికే తీన్మార్ మల్లన్నతో చర్చలు జరిపారట. తెలంగాణ టీడీపీ పగ్గాలిస్తే తీసుకునేందుకు సిద్ధమని మల్లన్న చెప్పారట. అయితే దీనిపై టీడీపీ హైకమాండ్ ఎలా స్పందించిందో తెలియరాలేదు.
Also Read :Agent Trump : ట్రంప్ రష్యా గూఢచారా ? ఆయన కోడ్ నేమ్ ‘క్రస్నోవ్’ ?
టార్గెట్ జీహెచ్‌ఎంసీ పోల్స్
అన్నీ అనుకున్నట్టుగా జరిగితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లోగా హైదరాబాద్ పరిధిలో టీడీపీ యాక్టివ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఆంధ్రా ప్రజలు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ సిటీలోని ప్రాంతాలపై టీడీపీ ఫోకస్ చేస్తుందని అంటున్నారు. తీన్మార్ మల్లన్న టీటీడీపీలో చేరితే మంచి ఫలితాలు ఖాయమనే ఆశాభావంతో చంద్రబాబు, లోకేశ్ ఉన్నారట. మరో 10 నెలల్లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం టీ టీడీపీకి పొలిటికల్ కన్సల్టెన్సీ ‘షోటైమ్’ సహాయ సహకారాలను అందించనుందట. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీడీపీ కోసం ఈ సంస్థే పనిచేసింది.
Also Read :Copy Paste Blunder: కాపీ పేస్ట్ తప్పిదం.. రూ.52వేల కోట్లు తప్పుడు బ్యాంకు ఖాతాకు !
‘షోటైమ్’ గ్రౌండ్ వర్క్
‘షోటైమ్’ సంస్థ హైదరాబాద్‌లో ఆఫీసు పెట్టి, గ్రౌండ్ వర్క్ చేస్తోంది. హైదరాబాద్ పరిధిలో గతంలో టీడీపీ(Telangana TDP) గెల్చిన అసెంబ్లీ స్థానాల్లోని సానుభూతిపరులను షోటైమ్ ప్రతినిధులు కలుస్తున్నారు. ఆసక్తి ఉన్న వారిని టీడీపీలోకి తిరిగి ఆహ్వానిస్తున్నారు. ప్రధానంగా సిటీలోని ఎల్‌బీ నగర్, మహేశ్వరం, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలలోని జీహెచ్‌ఎంసీ స్థానాలపై టీడీపీ గురిపెట్టిందట. ఎన్నికలు సమీపించాక నారా లోకేశ్ రంగంలోకి దిగుతారని తెలుస్తోంది. జనసేన, బీజేపీతో కలిసి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ భావిస్తోందట.