తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement) బకాయిల సమస్య మళ్లీ రాజుకుంది. ప్రభుత్వం నుండి బకాయిలు విడుదల చేయాలంటూ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇనిస్టిట్యూషన్స్ (FATHI) ఇప్పటికే ఇంజినీరింగ్ కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ విషయంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబుతో ఫాథీ ప్రతినిధులు జరిపిన చర్చలు ఫలించలేదు. దీంతో నేడు మరోసారి చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలు కూడా విఫలమైతే కళాశాలలు బంద్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
CM Revanth Reddy: కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా సాధిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
ప్రభుత్వం నుంచి బకాయిలు రాకపోవడంతో కళాశాలల నిర్వహణ, ఉద్యోగుల జీతాలు, ఇతర ఖర్చుల నిర్వహణ కష్టంగా మారిందని ఫాథీ చెబుతోంది. ప్రభుత్వం త్వరగా స్పందించకపోతే విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని కళాశాల యాజమాన్యాలు కోరుతున్నాయి. లేదంటే, బంద్ అనివార్యమని స్పష్టం చేశాయి.
నేటి చర్చలలో ఒకవేళ సయోధ్య కుదరకపోతే, ఇంజినీరింగ్ కాలేజీలు రేపటి నుంచి బంద్ కానున్నాయి. అంతేకాకుండా, డిగ్రీ, పీజీ కళాశాలలు కూడా ఈ నెల 16 నుంచి బంద్ చేసే అవకాశముంది. ఈ బంద్ వల్ల విద్యార్థులకు క్లాసులు ఉండవు, దీంతో వారి విద్యాభ్యాసానికి ఆటంకం కలుగుతుంది. ప్రభుత్వం, కళాశాల యాజమాన్యాలు ఈ సమస్యను త్వరగా పరిష్కరించి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు కోరుతున్నారు.