Taj Banjara Hotel: హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1లో ఉన్న తాజ్ బంజారా హోటల్‌ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) అధికారులు సీజ్ చేశారు. గత రెండేళ్లుగా పన్నులు చెల్లించకపోవడంతో ఈమేరకు చర్యలు తీసుకున్నారు. పన్నులు చెల్లించాలని పలుమార్లు నోటీసులు పంపినా, తాజ్ బంజారా హోటల్ నిర్వాహకులు స్పందించలేదు. దీంతో సీజ్ చేశారు. హోటల్ గేట్లకు తాళాలు వేశారు. జీహెచ్‌ఎంసీకి తాజ్ బంజారా హోటల్(Taj Banjara Hotel) రూ.1.43 కోట్ల పన్ను బకాయి ఉందని అధికారులు వెల్లడించారు. పన్ను చెల్లించాలని రెండు రోజులు గడువు ఇచ్చినా హోటల్ నిర్వాహకులు పట్టించుకోలేదన్నారు. దీంతో ఇవాళ(శుక్రవారం) ఉదయాన్నే చర్యలు చేపట్టామన్నారు.
Also Read :Peddireddy : తిరుపతి నడిబొడ్డున మాజీ మంత్రి కబ్జా ?!
ఆస్తిపన్ను బకాయిల చిట్టా..
- జీహెచ్‌ఎంసీ 2024-25 ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.2100 కోట్ల ఆస్తిపన్ను వసూళ్ల టార్గెట్‌ను పెట్టుకుంది.ఇప్పటివరకు రూ.1450 కోట్ల దాకా వసూలయ్యాయి.
- ఇంకా 5 లక్షల మంది భవన యజమానుల నుంచి దాదాపు రూ.600 కోట్ల ఆస్తిపన్ను బకాయిలు రావాల్సి ఉన్నాయి.
- ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రూ.5000 కోట్ల దాకా ఆస్తిపన్ను బకాయిలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ కార్యాలయాల బకాయిలే రూ.3000 కోట్లు. మిగతా రూ.2000 కోట్లు సాధారణ ఆస్తిపన్ను చెల్లింపుదారుల కట్టాల్సి ఉంది.
- జీహెచ్‌ఎంసీ ఇప్పటికే మూడు సార్లు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పథకాన్ని అమలు చేసింది. ఇప్పుడు మళ్లీ ఆ పథకాన్ని అమలు చేస్తే కనీసం రూ.500 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ద్వారా దాదాపు 2 లక్షల మంది బకాయిదారులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. అయితే దీనికి ప్రభుత్వ అనుమతి లభించాల్సి ఉంది.
- వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పథకం అమలైతే ఆస్తిపన్ను చెల్లించాల్సిన వారు తక్కువ వడ్డీతో తమ బకాయిలను పే చేయొచ్చు. దీనివల్ల ప్రజలకు ఉపశమనం లభించడమే కాకుండా, జీహెచ్‌ఎంసీకి భారీగా ఆదాయం సమకూరుతుంది.