Site icon HashtagU Telugu

T-SAT: గ్రూప్-1 మేయిన్స్ అభ్యర్థుల కోసం టి-సాట్ స్పెషల్ లెసన్స్ – సీఈవో వేణుగోపాల్ రెడ్డి

T- SAT

T- SAT

గ్రూప్-1 మేయిన్స్ పరీక్ష (Group-1 Mains Exam) రాసే అభ్యర్థుల కోసం టి-సాట్ ప్రత్యేక పాఠాలు ప్రసారం చేయనుంది. ఇప్పటికే ప్రిలిమ్స్ పరీక్ష రాసే అభ్యర్థుల కోసం ప్రత్యేక అవగాహన పాఠ్యాంశాలు అందించిన టి-సాట్ మేయిన్స్ అభ్యర్థుల కోసమూ 750 ఎపిసోడ్స్ సిద్ధం చేసింది. ఈ మేరకు టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి (CEO Bodanapally Venugopal Reddy) సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు.

తెలంగాణ ప్రభుత్వం టీజీపీయస్సీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అనేక పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు వెన్ను దన్నుగా నిలిచిన టి-సాట్ గ్రూప్-1 మేయిన్స్ అభ్యర్థులకూ పూర్తి స్థాయిలో అండగా నిలువనుందని సీఈవో హామీ ఇచ్చారు. అక్టోబర్ 21వ తేదీన టీజీపీయస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే మేయిన్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం అనుభవం కలిగిన ఫ్యాకల్టీచే బోధింపబడిన పాఠ్యాంశాలు ఆగస్టు ఆరవ తేదీ నుండి అక్టోబర్ 19వ తేదీ వరకు ప్రసారమయ్యే విధంగా షెడ్యూల్ ఖరారు చేశామన్నారు. అరగంట నిడివిగల పాఠ్యాంశాలను రోజుకు ఐదు గంటల చ్పొప్పున 10 ఎపిసోడ్స్ 75 రోజులు టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లలో ప్రసారమౌతాయని సీఈవో వివరించారు.

టి-సాట్ నిపుణ ఛానల్ లో సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి 10 గంటల వరకు, అవే ప్రసారాలను మరుసటి రోజు ఉదయం ఐదు గంటల నుండి 10 గంటల వరకు విద్య ఛానల్ ద్వార ప్రసారం చేస్తామని వేణుగోపాల్ రెడ్డి వివరించారు. ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమ్స్ అభ్యర్థుల కోసం సుమారు 1200 గంటల అవగాహన పాఠ్యాంశాలను అందించి గ్రూప్-1 ప్రిలిమ్స్ నుండి మేయిన్స్ పరీక్షకు అర్హత సాధించేందుకు అభ్యర్థులకు టి-సాట్ అండగా నిలిచిందన్నారు.

మరో మూడు నెలల్లో జరగనున్న గ్రూప్-1 మేయిన్స్ పరీక్షకు సైతం అదే ప్రోత్సాహాన్ని టి-సాట్ అందిస్తోందని, పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఈవో సూచించారు. లక్షల రూపాయలు వెచ్చించి కోచింగ్ సెంటర్లకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉండి టి-సాట్ అందించే ప్రసారాల ద్వారా నిరుద్యోగ యువత మంచి ఫలితాలు సాధించవచ్చని సీఈవో వేణుగోపాల్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

Read Also : Kala Sarpa Dosha: కాలసర్ప దోషం నుంచి విముక్తి పొందాలంటే నాగుల పంచమి రోజు ఇలా చేయాల్సిందే?

Exit mobile version