T-SAT: తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేయబోయే విద్యా పాలసీలో టి-సాట్ (T-SAT)ను భాగస్వామిని చేయాలని టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి విద్యా పాలసీ కమిటీ ఛైర్మన్, ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావును కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు రూపొందించనున్న ఈ నూతన విద్యా విధానంలో టి-సాట్ సేవలను వినియోగించుకోవడం అత్యంత ఆవశ్యకమని ఆయన పేర్కొన్నారు.
గురువారం హైదరాబాద్‌లోని కేశవరావు నివాసంలో ఆయనను కలిసిన సీఈవో వేణుగోపాల్ రెడ్డి, టి-సాట్ రూపొందించిన పాలసీ డాక్యుమెంట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన టి-సాట్ డిజిటల్ విద్యా ఛానళ్ల సేవలను వివరించారు. ప్రాథమిక విద్య నుండి యూనివర్సిటీ స్థాయితో పాటు పోటీ పరీక్షలకు అవసరమయ్యే అత్యుత్తమ కంటెంట్‌ను అందించి, దేశంలోనే డిజిటల్ విద్యా ఛానళ్లలో టి-సాట్ మొదటి స్థానంలో ఉందని సీఈవో గుర్తుచేశారు.
Also Read: Viral: పెళ్లి తంతు జరగకుండా చేసిన రసగుల్లా ..అసలు ఏంజరిగిందంటే !!
5 సంవత్సరాల విద్యార్థి నుండి 60 సంవత్సరాల వ్యక్తుల వరకు అవసరమయ్యే విద్యకు సంబంధించిన కంటెంట్ టి-సాట్ శాటిలైట్, యాప్, ఓ.టి.టి, సోషల్ మీడియా వంటి వివిధ డిజిటల్ ప్రసార మాధ్యమాల్లో అందుబాటులో ఉందని వివరించారు. కేవలం రెండు సంవత్సరాల్లోనే 4.8 మిలియన్ల వ్యూస్‌తో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటూ టి-సాట్ దేశంలోనే మొదటి స్థానాన్ని అధిరోహించింది. తెలంగాణ ప్రభుత్వం రూపొందించబోయే నూతన ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా తెలంగాణ సమాజానికి డిజిటల్ సేవలను అందించడానికి తమ సంస్థ సిద్ధంగా ఉందని సీఈవో తెలిపారు.
కేశవరావు హామీ
సీఈవో అందజేసిన డాక్యుమెంట్‌ను పరిశీలించిన కేశవరావు సంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ స్థాయిల్లోని విద్యార్థులు, యువత, వయోజనులు, మహిళలతో పాటు ఇతర రంగాలకు టి-సాట్ అందిస్తున్న డిజిటల్ సేవలను ఆయన కొనియాడారు. తెలంగాణ నూతన విద్యావిధానంలో టి-సాట్ సేవలు తప్పనిసరిగా వినియోగించుకునే విధంగా పాలసీని రూపొందిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.
