Site icon HashtagU Telugu

T BJP : గ్రూప్ ల‌పై సోషల్ మీడియా హోరు! త‌రుణ్ చుక్ ఫుల్ స్టాప్‌!!

T Bjp

T Bjp

సోష‌ల్ మీడియా తెలంగాణ బీజేపీని(T BJP) రోడ్డున ప‌డేసింది. ఆ పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ‌ను ఛిన్నాభిన్నం చేసింది. గ్రూపుల వ్య‌వ‌హారాన్ని బ‌య‌టేసింది. ఎవ‌రూ ఖండించ‌క‌పోవ‌డంతో సోష‌ల్ మీడియా తెలంగాణ బీజేపీని ఆడుకుంది. ఫ‌లితంగా గ‌త రెండేళ్లుగా పెంచుకున్న గ్రాఫ్ ఢ‌మాల్ అయింది. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల త‌రువాత బీజేపీ ఎక్కుడుంది? అనే ప్ర‌శ్న వేసుకునేలా సోష‌ల్ మీడియా చేసింది. గ‌త రెండు వారాలుగా బీజేపీలోని అంత‌ర్గ‌త గ్రూపు వ్య‌వ‌హారాన్ని చీల్చి చెండాడింది. స్థానిక లీడ‌ర్లు ముందుకొచ్చి ఖండిస్తే ఒట్టు. చివ‌ర‌కు తెలంగాణ ఇంచార్జి త‌రుణ్ చుక్ క్లారిటీ ఇచ్చారు. పార్టీలో గ్రూపులు లేవ‌ని తేల్చేశారు. అంతేకాదు, వ‌చ్చే ఎన్నిక‌ల‌కు బండి సంజ‌య్ సార‌థ్యంలోనే వెళ‌తామ‌ని చెప్పేశారు. దీంతో ఇప్పుడు సోష‌ల్ మీడియా గప్ చిప్ అయింది.

సోష‌ల్ మీడియా తెలంగాణ బీజేపీని రోడ్డున ప‌డేసింది(T BJP) 

కాంగ్రెస్ పార్టీ మాదిరిగా బీజేపీ(T BJP) అడ్మినిస్ట్రేష‌న్ ఉండ‌దు. గ్రూపులు, ఆరోప‌ణ‌లపై గుమ్మ‌నంగా అధ్య‌యనం చేస్తుంది. నిజ‌మ‌ని తేలితే, ఎంత‌టి పెద్ద వాళ్ల‌నైనా ఇంటికి పంపిస్తోంది. ఉదాహ‌ర‌ణ‌కు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు బంగారు ల‌క్ష్మ‌ణ్ ను బ‌హిష్క‌రించింది. ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా ఉండే క‌న్నా లక్ష్మీనారాయ‌ణను ప‌క్క‌న పెట్టేసింది. తెలంగాణ‌కు చెందిన ఎమ్మెల్యే రాజాసింగ్ ను కూడా బహిష్కరించింది. ఇలా, ప‌లు ఉదాహ‌ర‌ణ‌ల‌ను చెప్పుకోవ‌చ్చు. అందుకే, బీజేపీ క్ర‌మ‌శిక్ష‌ణ‌ను త‌ట్టుకోవ‌డం క‌ష్టం. ప్ర‌త్యేకించి కాంగ్రెస్ లో ప‌నిచేసిన నాయ‌కులు బీజేపీలో కొన‌సాగ‌డం ముళ్ల మీద న‌డిచిన‌ట్టే ఉంటుంది. అందుకే, ఇప్పుడు బీజేపీలోకి వ‌చ్చిన ఇత‌ర పార్టీల నేత‌లు కొంద‌రు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను అన్వేషించుకుంటున్నారు.

సొంత ఇమేజ్ తో హుజారాబాద్ నుంచి గెలుపొంద‌ని ఈటెల గ్రాఫ్

సాధార‌ణంగా బీజేపీ అధ్యక్ష బాధ్య‌త‌ల‌ను ఆర్ఎస్ఎస్ నుంచి వ‌చ్చిన వాళ్ల‌కు ఇస్తుంటారు. పార్టీ క‌ట్టుబాట్లు, భావ‌జాలం అక్క‌డ నుంచి వ‌చ్చిన వాళ్ల‌కు బాగా తెలుస‌ని అధిష్టానం అభిప్రాయం. అందుకే, సంఘ్ మూలాలున్న నాయ‌కుల‌కు ప్రాధాన్యం ఉంటుంది. కానీ, తెలంగాణ బీజేపీ (T BJP)ప్ర‌స్తుతం ఇత‌ర పార్టీల నేత‌లతో నిండిపోయింది. ప్ర‌త్యేకించి లెఫ్ట్ భావ‌జాలం ఉన్న వాళ్లు కూడా ఉన్నారు. కానీ, వాళ్లు రైట్ భావ‌జాలాన్ని వినిపించ‌డం క‌ష్టం. ఆ కోవ‌లోకి వ‌చ్చే లీడ‌ర్ ఈటెల రాజేంద్ర‌. ఆయ‌న బీజేపీలో అస‌హ‌నంగా ఉన్నార‌న్న మాట వాస్త‌వం. అలాగ‌ని, ఆ పార్టీ వీడలేని ప‌రిస్థితి ఆయ‌న‌కు ఉంది. బీఆర్ఎస్ చీఫ్ గెంటేయ‌డంతో దిక్కుతోచ‌ని ఈటెల సేఫ్ గార్డ్ చేసుకోవ‌డానికి బీజేపీ పంచ‌న చేరారు. ఆ రోజే కాంగ్రెస్ లోకి వెళ్ల‌డానికి ఆయ‌న ప్ర‌య‌త్నం చేశారు. కానీ, కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేక‌పోవ‌డంతో సొంత ర‌క్ష‌ణ కోసం బీజేపీని ఆశ్ర‌యించారు.

బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఎన్నిక‌ల వ‌ర‌కు ఆ ప‌ద‌విలోనే

సొంత ఇమేజ్ తో హుజారాబాద్ నుంచి గెలుపొంద‌ని ఈటెల గ్రాఫ్ బీజేపీలోనూ పెరిగింది. అయితే, బండి సంజ‌య్ ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల‌ను ఆయ‌న్ను ఇబ్బంది పెడుతున్నాయి. పైగా ఇద్ద‌రూ ఒకే జిల్లా కావ‌డం, బీసీ నాయ‌కులుగా ఎదిగారు. దీంతో గ్రూపులు స‌హ‌జంగా ఏర్ప‌డ్డాయి. అప్ప‌టికే బండికి వ్య‌తిరేకంగా ఉన్న గ్రూప్ కు ఈటెల అస్త్రంలా మారారు. ఫ‌లితంగా క‌రీంన‌గ‌ర్ బీజేపీ ర‌చ్చ ఢిల్లీ వ‌ర‌కు వెళ్లింది. ఆ జిల్లాలోని గ్రూపు విభేదాలు మిగిలిన జిల్లాల వ‌ర‌కు వ్యాప్తి చెందాయి. ఇత‌ర పార్టీల నుంచి బీజేపీలోకి వ‌చ్చిన లీడ‌ర్లు ఎక్కువ మంది బండి నాయ‌క‌త్వాన్ని వ్య‌తిరేకించారు. అదే సంద‌ర్భంలో ఈటెల నాయ‌క‌త్వాన్ని కొంద‌రు స‌మ‌ర్థించారు. మాజీ మంత్రి డీకే అరుణ నాయ‌క‌త్వాన్ని మ‌రికొంద‌రు వినిపించారు. కానీ, కాంగ్రెస్ త‌ర‌హాలో బీజేపీ( T BJP) ఉండ‌ద‌ని సీనియ‌ర్ల‌కు సైతం తెలియ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Also Read : Telangana BJP: బీజేపీ ప్లాన్ – బి షురూ.. అమిత్ షా వ్యూహం స‌క్సెస్ అయితే బీఆర్ఎస్‌కు షాకే!

ప్ర‌స్తుతం ఉన్న బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఎన్నిక‌ల వ‌ర‌కు ఆ ప‌ద‌విలోనే కొన‌సాగుతారు. సీనియ‌ర్ల‌కు ఎలాంటి ప్ర‌త్యేక‌మైన ప‌ద‌వులు ఇవ్వ‌రు. పార్టీ లైన్లో న‌డిచే వాళ్లు ఉంటారు. పోయే వాళ్లు పోతారు. ఇదీ బీజేపీ అధిష్టానం తీరు. ఇప్పుడు సీనియ‌ర్లు ఏమి చేస్తారు? అనేది ప్ర‌శ్న‌. ఇలాంటి గంద‌ర‌గోళం మ‌ధ్య ఖ‌మ్మం స‌భ విజ‌య‌వంతం కాద‌ని తెలుసుకున్న అమిత్ షా పర్య‌ట‌న‌ను వాయిదా వేసుకున్నారు. ఈనెల 25న బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా తెలంగాణ‌కు వ‌స్తున్నారు. ఆ సంద‌ర్భంగా ఆయ‌న నాయ‌కుల‌కు దిశానిర్దేశం చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం నెల‌కొన్ని గ్రూపు విభేదాలకు(T BJP) త‌రుణ్ చుక్ తాత్కాలిక ఉప‌శ‌మ‌నం క‌లిగించేలా స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో సోష‌ల్ మీడియాలో హోరెత్తిన బీజేపీలోని గ్రూపుల విభేదాల న్యూస్ ప్ర‌స్తుతానికి చ‌ల్ల‌బ‌డిన‌ట్టే.

Also Read : Etela Vs Bandi: తెలంగాణ బీజేపీలో వర్గ పోరు.. ఈటెల టార్గెట్?