MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈసారైనా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ వస్తుందని అందరూ భావించారు. కానీ సుప్రీంకోర్టు ధర్మాసనం కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణను ఇవాళ కూడా మరోసారి వాయిదా వేసింది. వచ్చే మంగళవారం దీనిపై విచారణ జరుపుతామని వెల్లడించింది. కవిత బెయిల్ పిటిషన్‌పై సీబీఐ, ఈడీల స్పందనను సుప్రీంకోర్టు అడిగింది. అయితే సీబీఐ మాత్రం తమ స్పందనను కోర్టుకు తెలియజేసింది. ఇక ఈడీ మాత్రం తమ స్పందనను తెలియజేసేందుకు కాస్త సమయం కావాలని అడిగింది. దీంతో గురువారం (ఈనెల 23)లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని సుప్రీంకోర్టు ఆదేశించింది.
We’re now on WhatsApp. Click to Join
శుక్రవారంలోగా కవిత తరఫున న్యాయవాది రిజాయిండర్ దాఖలు చేయాలని న్యాయస్థానం సూచించింది. కవిత(MLC Kavitha) పిటిషన్‌పై వచ్చే మంగళవారం (ఆగస్టు 27న) విచారణ జరుపుతామని న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ ధర్మాసనం వెల్లడించింది. కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ నేపథ్యంలో బీఆర్‌ఎస్ నాయకులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి , మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఢిల్లీకి చేరుకున్నారు.
Also Read :Doctor Murder : జూనియర్ వైద్యురాలిపై అఘాయిత్యం.. కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌పై అవినీతి కేసు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను ఈడీ మార్చి 15న, సీబీఐ ఏప్రిల్ 11న అరెస్ట్ చేసింది. ఆమె గత ఐదు నెలలుగా ఢిల్లీలోని తిహార్ జైలులోనే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. లిక్కర్ పాలసీ విషయంలో తనపై ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసుల్లో బెయిల్ ఇవ్వాలంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను జూలై 1న ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు, ఢిల్లీ హైకోర్టులలో వరుసగా ఊరట లభించకపోవడంతో నేరుగా దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని కవిత ఆశ్రయించారు. ప్రతివాదుల వాదనలు వినకుండా కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.