Supreme Cout : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, డాక్టర్ సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత రెండో పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. పార్టీ ఫిరాయించిన ఏడుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
ఇక, కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని వేసిన మొదటి పిటిషన్‌తో పాటు రెండో పిటిషన్‌ను విచారిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఫిబ్రవరి 10న మొదటి పిటిషన్ విచారణతో పాటు రెండో పిటిషన్‌పై విచారణ చేస్తామని తాజా పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
బీఆర్‌ఎస్ పార్టీ గతంలోనే పార్టీ ఫిరాయింపులపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదంటూ బీఆర్‌ఎస్ నేతలు కూడా ధీమాతో ఉన్నారు.. అందుకు తగ్గట్టే, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై.. నాలుగువారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ అప్పట్లో తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ స్పీకర్‌ను ఆదేశించింది. అయితే, పార్టీ మారిన ఎమ్మెల్యేలు.. ఈ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు డివిజన్ బెంచ్ పార్టీమారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ సెప్టెంబర్ 9న సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 10వ షెడ్యూల్.. అసెంబ్లీ ఐదేళ్ల గడువును దృష్టిలో పెట్టుకుని.. స్పీకర్ తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.