Kanti Velugu : వంద రోజులు పూర్తి చేసుకున్న కంటి వెలుగు 2.0

వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 24 జిల్లాల్లో కంటివెలుగు 2.0 కార్య‌క్ర‌మం 100

  • Written By:
  • Publish Date - June 18, 2023 / 07:41 AM IST

వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 24 జిల్లాల్లో కంటివెలుగు 2.0 కార్య‌క్ర‌మం 100 రోజులు పూర్తి చేసుకుంది. కంటివెలుగు కార్యక్రమం విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సచివాలయంలో ఘనంగా వేడుకలు జరిగాయి. 24 జిల్లాల్లో 100 శాతం స్క్రీనింగ్‌లు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హ‌రీష్ రావు.. అంకితభావంతో పనిచేస్తున్న ఆశా, ఏఎన్‌ఎం కార్యకర్తలను అభినందించారు. కంటివెలుగు కార్యక్రమం తెలంగాణలో నివారణ చర్యలను అందించడం, అంధత్వాన్ని నిర్మూలించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మహత్తర కార్యక్రమ నిర్వహణలో పాల్గొన్న ఆరోగ్య శాఖ, ఇతర శాఖలు, ప్రజాప్రతినిధుల కృషిని హరీశ్‌రావు కొనియాడారు. తెలంగాణ ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు, కళ్లద్దాలు అందించే ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని అమలు చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర కీల‌క‌మ‌న్నారు. కంటివెలుగు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా 161 మిలియన్ల మందిని విజయవంతంగా పరీక్షించిందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా 22.51 లక్షల మందికి ఉచితంగా రీడింగ్ గ్లాసెస్ అందజేయగా, 18.08 లక్షల మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ ఉచితంగా అందించారు. తెలంగాణ వ్యాప్తంగా కంటి పరీక్షలు పూర్తి చేసేందుకు మిగిలిన తొమ్మిది జిల్లాల్లో కూడా ఇదే విధమైన అంకితభావం, స్ఫూర్తిని కొనసాగించాలని హరీశ్‌రావు అధికారులను కోరారు.