Site icon HashtagU Telugu

MGBS : నీట మునిగిన ఎంజీబీఎస్..తాళ్ల సాయంతో బయటకు ప్రయాణికులు

Mgbs Musi

Mgbs Musi

హైదరాబాదులో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో మూసీ నది(Musi River) ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ముఖ్యంగా ఎంజీబీఎస్ (MGBS) వద్ద మూసీ ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో అక్కడి రెండు వంతెనలపై నుంచే నీరు ఉరకలేస్తోంది. ఫలితంగా ఎంజీబీఎస్ బస్ స్టేషన్‌ మొత్తం వరదనీటితో చుట్టుముట్టి లోపలకు నీరు చేరింది. ఈ కారణంగా బస్సులు, ప్రయాణికులు ఎంజీబీఎస్ లోపలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడి, అధికారులు తాత్కాలికంగా స్టేషన్‌ను మూసివేయాల్సి వచ్చింది. నగరంలోని ఈ ప్రధాన రవాణా కేంద్రం నిలిచిపోవడంతో వేలాది మంది ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు.

‎Paneer: ప్రతీ రోజు పనీర్ తింటే ఏం జరుగుతుంది.. ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మీకు తెలుసా?

హిమాయత్ సాగర్‌లో కూడా వరద పోటెత్తుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో 11 గేట్లు 6 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 18,500 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 20,872 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 2.97 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 2.76 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. పోలీసులు, జీహెచ్ఎంసీ సంయుక్తంగా పునరావాస చర్యలు చేపట్టి ఇప్పటికే అనేక కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పరివాహక ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి, ప్రజలు మూసీకి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

మూసీ ఉద్ధృతితో చాదర్‌ఘాట్ వద్ద ఉన్న చిన్న వంతెనను మూసివేసి, పెద్ద వంతెన ఒక్కటే రాకపోకలకు తెరిచి ఉంచారు. ఫలితంగా కోఠి, నాంపల్లి వైపు వెళ్లే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తి, చాదర్‌ఘాట్ నుంచి మలక్‌పేట్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎంజీబీఎస్‌లోకి నీరు చేరడంతో అధికారులు బస్సుల మార్గాలను తాత్కాలికంగా మళ్లించారు. ఖమ్మం, నల్లగొండ, మిర్యాలగూడ నుంచి వచ్చే బస్సులు దిల్‌సుఖ్‌నగర్ వరకు, కర్నూలు, మహబూబ్‌నగర్ నుంచి వచ్చే బస్సులను ఆరాంఘర్ వద్ద ఆపుతున్నారు. వరంగల్, హనుమకొండ నుంచి వచ్చే బస్సులు ఉప్పల్ వరకు, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ నుంచి వచ్చే బస్సులు జేబీఎస్ వరకు మాత్రమే అనుమతిస్తున్నారు. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికుల పికప్ పాయింట్లు మార్చినట్లు ఎంజీబీఎస్ అధికారి సుఖేందర్ రెడ్డి తెలిపారు. రేపటినుంచి వందమంది అదనపు సిబ్బందిని విధుల్లోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

Exit mobile version