సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న వందేభారత్ రైలు (Vande Bharat Train)పై శుక్రవారం రాళ్ల దాడి జరిగింది. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా మీదుగా వెళ్తున్న సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ రైలు కోచ్‌పై శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు రైల్వే అధికారులు సమాచారం అందించారు. రాళ్ల దాడి ఘటనను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక విచారణలో రైలుపై చిన్నారులు రాళ్లు రువ్వి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయంపై విచారణ జరుగుతోంది.
రైల్వే పోలీసులు స్వయంగా కేసు నమోదు చేశారు. మహబూబాబాద్-గార్ల స్టేషన్ల మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ పై జరిగిన ఈ దాడిలో ఓ బోగీ అద్దం ధ్వంసమైంది. అయితే ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి జరగడం ఇదే తొలిసారి కాదు. గత నెలలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభానికి ముందు విశాఖపట్నంలోని రైల్వే యార్డు వద్ద రైలు కోచ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో రైలు అద్దాలు ధ్వంసం అయ్యాయి.
Also Read: Lakshmi Devi: పర్సులో ఇవి ఉంచుకుంటే చాలు.. లక్ష్మి మీ వెంటే?
ఇటీవల మరోసారి ఖమ్మం జిల్లాలో రాళ్ల దాడి జరగ్గా ఎమర్జెన్సీ విండో దెబ్బతింది. దాంతో రైలు మూడు గంటలు ఆలస్యంగా సికింద్రాబాద్ చేరుకుంది. జనవరి 15న మకర సంక్రాంతి సందర్భంగా తెలంగాణలోని సికింద్రాబాద్- ఆంధ్రప్రదేశ్ మధ్య వందేభారత్ రైలు సర్వీసును ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు.