Site icon HashtagU Telugu

Hanumantha Rao : కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంత రావు కారుపై రాళ్ల దాడి

V Hanumantha Rao Congress Amberpet

Hanumantha Rao : హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు కారుపై దుండగులు బుధవారం తెల్లవారుజామున రాళ్లతో దాడికి తెగబడ్డారు.కారు ఆయన ఇంటి ఎదుట పార్క్ చేసి ఉన్న టైంలో ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు పెద్దరాళ్లను హనుమంతరావు కారుపైకి విసిరినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కారు పాక్షికంగా దెబ్బతిన్నట్లు సమాచారం. అయితే అది రాళ్ల దాడి కాదని.. కారును మరో వాహనంతో ఢీకొట్టారని పలువురు అంటున్నారు. మొత్తం మీద దీనిపై వి.హనుమంత రావు సీరియస్ అయ్యారు. ఇంటి ఎదుట పార్క్ చేసిన కారును కూడా టార్గెట్ చేయడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. వీహెచ్ నేరుగా అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌‌కు వెళ్లి దీనిపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు. హనుమంత రావు(Hanumantha Rao) కారును పార్క్ చేసిన ఏరియాలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని ప్రస్తుతం సేకరిస్తున్నారు. దాని ఆధారంగా కారుపై దాడి ఎలా జరిగింది ? ఎవరు దాడి చేశారు ? ఎంత మంది దాడి చేశారు ? అనే వివరాలను తెలుసుకునే యత్నంలో పోలీసులు ఉన్నారు.

Also Read :RGV Video : నాపై కక్ష సాధింపు.. అప్పటి కామెంట్స్‌కు ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయా ? : ఆర్జీవీ

నవంబరు 2న బాగ్‌అంబర్‌పేట డివిజన్‌లోని తన నివాసంలో వి.హనుమంతరావు కేదారీశ్వర వ్రతాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌ బాబు పాల్గొన్నారు. ఏటా దీపావళి పండగ తర్వాత కేదారీశ్వర వ్రతాన్ని సంప్రదాయబద్ధంగా ఆచరించడం తమ పూర్వీకుల నుంచి ఆనవాయితీగా వస్తోందని అప్పట్లో వీహెచ్‌ చెప్పారు. ఇక వి. హనుమంతరావు జీవిత చరిత్ర పుస్తకాన్ని అక్టోబరు 26న ఢిల్లీ వేదికగా లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ నాయకులు డి రాజా, కె నారాయణ, తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, కొప్పుల రాజు హాజరయ్యారు.