సికింద్రాబాద్ (Secunderabad ) గోపాలపురంలోని యూనివర్సల్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్(Srishti Test Tube Baby Center)లో జరిగిన సంచలన ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఒక మహిళ తన భర్త వీర్య కణాలతో గర్భం దాల్చాలని ఆశించి సదరు సెంటర్‌ను ఆశ్రయించగా, సెంటర్ నిర్వాహకులు ఆమెకు భర్త వీర్యం (Sperm ) బదులుగా మరొకరి వీర్య కణాలను ఉపయోగించి గర్భం దాల్చేలా చేసినట్లు డీఎన్‌ఏ పరీక్ష ద్వారా బయటపడింది. దీనితో బాధిత దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న నార్త్ జోన్ డీసీపీ సాధన లక్ష్మి పెరమల్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు క్లినిక్‌లో తనిఖీలు కొనసాగాయి. ఈ దర్యాప్తులో పోలీసులతో పాటు రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఆసుపత్రిలో కీలకమైన పత్రాలు, ఆధారాలను స్వాధీనం చేసుకొని ఆసుపత్రిని సీజ్ చేసే ప్రక్రియను ప్రారంభించారు. క్లినిక్ సిబ్బందిని మరోచోటికి తరలించారు.
Green Chutney Recipe: డయాబెటిస్ బాధితులకు వరం గ్రీన్ చట్నీ.. తయారు చేసుకోండిలా!
దర్యాప్తులో అత్యంత దారుణమైన విషయాలు వెలుగుచూశాయి. క్లినిక్ నిర్వాహకులు పోర్న్ వీడియోలు చూపిస్తూ, వీర్య కణాలను సేకరిస్తూ ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. మొత్తం 16 శాంపిళ్లను స్వాధీనం చేసుకొని జిల్లా వైద్యాధికారికి (DMHO) అప్పగించారు. సరోగసీ కోసం వీర్యం సేకరిస్తున్నట్టు చెబుతున్నప్పటికీ, ఈ శాంపిళ్లు అహ్మదాబాద్‌కు తరలిస్తున్నట్టు గుర్తించారు. ఇప్పటివరకు ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
యూనివర్సల్ సృష్టి పేరుతో ఫెర్టిలిటీ కేంద్రాలు దేశంలోని పలు ప్రాంతాల్లో నడుస్తున్నట్లు బయటపడింది. విశాఖపట్నం, విజయవాడలోని బ్రాంచీలలోనూ పోలీసులు సోదాలు నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కోల్‌కతా తదితర ప్రాంతాల్లో ఈ సంస్థ శాఖలున్నాయని పోలీసులు నిర్ధారించారు. గతంలో కేసులు నమోదైనా, ఒక వైద్యురాలి లైసెన్స్ రద్దైన తర్వాత మరో వైద్యురాలి పేరుతో అక్రమ సరోగసీ కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటన ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేయగా, అధికారులు ఇటువంటి మోసపూరిత IVF కేంద్రాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.