హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్ EWS కాలనీ (SRNagar EWS Colony) వాసులకు పెద్ద చిక్కొచ్చి పడింది. ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న ఈ కాలనీ ప్రస్తుతం గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటోంది. కాలనీలో నిరంతరం ఏర్పడుతున్న ప్రైవేట్ హాస్టళ్ల (Private Hostels) వల్ల స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, ఎటువంటి పరిష్కారం దొరకకపోవడంతో కాలనీవాసులు నిరాశ చెందుతున్నారు. త్వరలోనే జీహెచ్ఎంసీ (GHMC) ఉన్నతాధికారులను కలవాలని వారు డిసైడ్ అయ్యారు.
Musk Vs Altman: ఓపెన్ ఏఐను కొనేస్తానన్న మస్క్.. ఎక్స్‌ను కొనేస్తానన్న శామ్ ఆల్ట్‌మన్
ఈడబ్ల్యూఎస్ కాలనీలో నెల రోజుల వ్యవధిలోనే పదుల సంఖ్యలో హాస్టళ్లు వెలుస్తున్నాయి. గతంలో హౌసింగ్ బోర్డు ఇండ్లు నిర్మించిన ఈ ప్రాంతం చిన్న చిన్న ఇండ్లతో, తక్కువ వెడల్పున్న రోడ్లతో నివాసయోగ్యమైన ప్రాంతంగా మాత్రమే ఉంది. అయితే కొంతమంది వ్యాపార దృక్పథంతో ప్రైవేట్ హాస్టళ్లు ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. తక్కువ స్థలంలో ఎక్కువ మంది ఉండటంతో కాలనీలో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి.
ప్రస్తుతం మౌలిక వసతులు కాలనీవాసులకు మాత్రమే సరిపోయేలా ఉన్నాయి. అయితే ప్రతి హాస్టల్‌లో కనీసం 50-70 మంది వరకు ఉంటుండటంతో కాలనీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా యువకులు రాత్రివేళ రోడ్లపై గుంపులుగా చేరి కాలక్షేపం చేయడం, పెద్ద సంఖ్యలో బైకులు పార్క్ చేయడం స్థానికులకు ఇబ్బంది పెడుతోంది. మహిళలు, ఆడపిల్లలు రాత్రివేళ రోడ్డు మీదకు రావడానికి భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్యలపై కాలనీవాసులు పలుమార్లు జీహెచ్ఎంసీ, జలమండలి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అనుమతుల్లేకుండా నిర్మాణాలు జరుగుతున్నా, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇబ్బందులు ఇంకా పెరిగిపోతున్నాయి. దీంతో కాలనీవాసులు తమ ఆందోళన వ్యక్తం చేస్తూ హాస్టళ్లకు వ్యతిరేకంగా బ్యానర్లు ఏర్పాటు చేయడం స్టార్ట్ చేసారు.