Legality To Hydra : హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే తమ హైడ్రా విభాగానికి చట్టబద్ధత కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను విడుదల చేస్తుందని ఆయన వెల్లడించారు. హైడ్రా చట్టబద్ధతపై ప్రశ్నలు సంధిస్తున్న వారికి అతిత్వరలోనే సమాధానం లభిస్తుందని రంగనాథ్ చెప్పారు. అక్టోబరులోగా ఆర్డినెన్స్ విడుదలయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈవివరాలను వెల్లడించారు.
Also Read :Taj Mahal : తాజ్‌మహల్ ప్రధాన గుమ్మటం నుంచి నీటి లీకేజీ.. కారణం అదే
ఆర్డినెన్స్ వచ్చాక హైడ్రాకు కొన్ని విశేష అధికారాలు కూడా లభిస్తాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్(Legality To Hydra) చెప్పారు. అక్టోబరులో ఆర్డినెన్స్ విడుదలవుతుందని.. అది జరిగిన ఆరు వారాల తర్వాత అసెంబ్లీలో హైడ్రా బిల్లును ప్రవేశపెడతారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీలు, నీటిపారుదల విభాగాలు, రెవెన్యూ శాఖకు హైడ్రా సహాయ సహకారాలను అందిస్తుందని ఆయన తెలిపారు. గ్రేహౌండ్స్, టాస్క్‌ఫోర్స్ విభాగాలలో స్వతంత్రంగా హైడ్రా కూడా కార్యకలాపాలను కొనసాగిస్తుందన్నారు. జీవో 99 ద్వారా జులై 19న హైడ్రా ఏర్పాటైన విషయాన్ని కమిషనర్ రంగనాథ్ గుర్తు చేశారు. హైడ్రా చట్టబద్ధమైన సంస్థే అని ఆయన స్పష్టం చేశారు.
Also Read :Zomato : రైల్వేశాఖతో జొమాటో ఒప్పందం.. 100కుపైగా రైల్వే స్టేషన్లలో ఫుడ్ డెలివరీ
హైడ్రాకు ఉన్న అధికారాలను సవాలు చేస్తూ లక్ష్మి అనే మహిళ వేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ సారథ్యంలోని తెలంగాణ హైకోర్టు బెంచ్ శుక్రవారం విచారణ చేపట్టింది. హైడ్రా తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలను ఎలా కూల్చేస్తారని ప్రశ్నించింది. జీవో 99పై వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. నోటీసు ఇవ్వకుండానే అమీన్‌పూర్‌లో ఈ నెల 3న షెడ్లు కూల్చిన విషయాన్ని కోర్టు గుర్తుచేసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నా ఎలా కూలుస్తారని హైడ్రాను హైకోర్టు నిలదీసింది. ఈనేపథ్యంలో ఇవాళ మీడియా సమావేశంలో హైడ్రా చట్టబద్ధతపై కమిషనర్ రంగనాథ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.