Medha Patkar : ప్రముఖ సామాజికవేత్త మేధాపాట్కర్‌ను హైదరాబాద్‌లోని చాదర్ ఘాట్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూసీ సుందరీకరణ పనులను ఆమె అడ్డుకోబోతున్నారనే పక్కా సమాచారంతోనే తాము అలర్ట్ అయినట్లు పోలీసులు తెలిపారు. అయితే తాను స్నేహితుల ఇంటికి వచ్చానని మేధాపాట్కర్ చెప్పారు. అయినా ఆమె మాటలను పోలీసులు అస్సలు పట్టించుకోలేదు. వెంటనే ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లాలని మేధా పాట్కర్‌కు సూచించారు. నర్మదా బచావో పేరుతో మేధాపాట్కర్ ఓ పర్యావరణ ఉద్యమాన్ని నడిపి ఫేమస్ అయ్యారు. దీంతో ఆమె మూసీ సుందరీకరణ పనుల వ్యవహారంపైనా గళం విప్పొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వాస్తవానికి 2022 సంవత్సరం ఏప్రిల్‌లో కూడా మలక్‌పేట పరిధి మూసారాంబాగ్‌లోని తీగలగూడలో మేధాపాట్కర్(Medha Patkar) పర్యటించారు. మూసీ పరివాహక ప్రాంతంలో గుడిసెలు కోల్పోయిన బాధితులతో ఆమె అప్పట్లో మాట్లాడారు. అనంతరం నేషనల్ అలియన్స్ ఆఫ్ పీపుల్ మూవ్‌మెంట్స్ (ఎన్‌ఏపీఎం), హ్యుమన్ రైట్స్ ఫోరం క్యాంపెయిన్ ఫర్ హౌసింగ్ రైట్స్, క్యాంపెయిన్ ఫర్ హౌజింగ్ అండ్ టెన్యూరల్ రైట్స్ (ఛత్రి), రైతు స్వరాజ్ వేదిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో మేధాపాట్కర్ మాట్లాడారు.
Also Read :Milk Mafia : మిల్క్ మాఫియా.. మాల్టోడెక్స్‌ట్రిన్ కలిపిన పాలతో గండం
మేధా పాట్కర్ నడిపే ట్రస్టుపై ఈ కేసు
ఆదివాసీ పిల్లల చదువుల పేరుతో వసూలు చేసిన డబ్బును దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో 2022 సంవత్సరం జులైలో మేధా పాట్కర్‌పై మధ్యప్రదేశ్‌లో కేసు నమోదైంది. ఆమె నడుపుతున్న నర్మదా నవనిర్మాణ అభియాన్ ట్రస్ట్ 14 ఏళ్లలో(2022 నాటికి) రూ.13 కోట్లు వసూలు చేసింది. ఈ నిధుల వినియోగానికి సంబంధించిన లెక్కలు సరిగ్గా లేవంటూ పోలీసులకు అప్పట్లో ఫిర్యాదు అందింది. దీని ప్రకారం రూ. 1.5 కోట్ల కంటే ఎక్కువ విలువైన నగదుకు సంబంధించిన ఆడిట్ అస్పష్టంగా ఉంది. మేధా పాట్కర్ తన వార్షిక ఆదాయాన్ని రూ. 6,000గా చూపి కోర్టును తపపుదోవ పట్టించారని ఫిర్యాదుదారుడు ఆరోపించారు. ఆమె సేవింగ్స్ ఖాతా నుంచి రూ.19 లక్షల మొత్తాన్ని రికవరీ చేశారని పోలీసుల ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించారు. తనపై వచ్చిన ఆరోపణలను మేధాపాట్కర్ అప్పట్లో ఖండించారు. ప్రతి ఆరోపణకు తన వద్ద సమాధానం ఉందన్నారు. తనపై ఫిర్యాదు చేసిన వారికి ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్‌లతో సంబంధాలు ఉన్నాయన్నారు.