SLBC Accident: ఎస్ఎల్‌బీసీ ప్ర‌మాదం.. కార్మికుల‌ను గుర్తించేందుకు రోబోలు: మంత్రి

త్వరగా కార్మికులను గుర్తించేందుకు ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు.

Published By: HashtagU Telugu Desk
SLBC Tunnel Incident

SLBC Tunnel Incident

SLBC Accident: దోమలపెంట ఎస్ఎల్‌బీసీలో జరిగిన ప్రమాద (SLBC Accident) సంఘటన ఒక జాతీయ విపత్తు అని, సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి, సహాయక చర్యలలో ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతికతను వినియోగించుకుంటున్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం ఉదయం అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దోమలపెంట ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌ను సందర్శించి వివిధ రంగాల నుంచి పనిచేస్తున్న రెస్క్యూ బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

సొరంగంలో చిక్కుకున్న కార్మికులను గుర్తించేందుకు ఇప్పటివరకు జరిగిన ప‌నుల‌పై రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షణ చేస్తున్న రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి అరవింద్ కుమార్, ఆర్మీ కమాన్‌డెంట్‌ పరిక్షిత్ మెహ్రా మంత్రికి వివరించారు. ఎన్‌జీఆర్ఐ, జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా, క్యాడవర్ డాగ్ బృందం, ర్యాట్ మైనర్స్, రోబోటిక్ రంగాల నిపుణులతో చర్చించి సహాయక చర్యలు వేగంగా జరగకపోవడానికి గల కారణాలు, అడ్డంకులు, వాటిని అధిగమించడానికి చేపట్టాల్సిన చర్యలపై సలహాలు సూచనలు చేశారు.

Also Read: Discount On Car: ఈ స్పోర్ట్స్‌ కారుపై రూ. 1.35 ల‌క్ష‌ల వరకు డిస్కౌంట్!

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సహాయక చర్యల్లో అవాంతరాలను అధిగమిస్తూ వేగంగా సహాయక చర్యలు కొనసాగుతాయని, సొరంగం లోపల సరిగ్గా ఆక్సిజన్ స్థాయి లేకపోవడం, నీరు అధికంగా ఊరటం, టీబీఎం దృఢమైన లోహ శకలాలు రాళ్లు, మట్టితో కూరుకుపోయి ఇబ్బందులు ఉన్నప్పటికీ సహాయక చర్యలు కొనసాగించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. రెస్క్యూ ఆపరేషన్‌లో పనిచేసే కార్మికులు, అధికారులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. త్వరగా కార్మికులను గుర్తించేందుకు ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. ఎంత నిధులు ఖర్చు అయినాసరే ప్రభుత్వం భరించేందుకు సిద్ధంగా ఉందన్నారు. టీబీఎం శకలాలు రాళ్లు, మట్టి, నీళ్లలో కూరుకుపోయి ఉండటంతో రెస్క్యూ చేసే సిబ్బందికి సైతం ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున అన్వి రోబోటిక్ నిపుణులతో సహాయక చర్యలు చేపట్టేందుకు 4 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. రోబోలను వెంటనే రంగంలోకి దింపాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

సహాయక చర్యలో అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్న అధికారులు, నిపుణులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. తాను తిరిగి 11వ తేదీన ఇక్కడికి వస్తానని.. రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం ఇక్కడికి రావడమా లేదా హైదారాబాద్‌లోనే ఎస్ఎల్‌బీసీ రెస్క్యూ ఆపరేషన్‌లో పనిచేస్తున్న ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహంచడం జరుగుతుందన్నారు. ఈరోజు జ‌రిగిన సమీక్ష సమావేశంలో స్థానిక శాసనసభ్యులువంశీకృష్ణ‌, రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి అరవింద్ కుమార్, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, ఆర్మీ డోగ్రా రెజిమెంట్ కమాండెంట్‌ పరిక్షీత్ మెహ్రా, మిలటరీ ఇంజనీర్ వికాస్ సింగ్, ఎన్‌డీఆర్ఎప్ క‌మాండెంట్ ప్రసన్న కుమార్, ఎస్.డి.ఆర్.ఎఫ్ క‌మాండెంట్ ప్రభాకర్, సింగరేణి, రైల్వే, ఎన్.జి.ఆర్. ఐ, హైడ్రా, తదితర రంగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

  Last Updated: 08 Mar 2025, 03:12 PM IST