Site icon HashtagU Telugu

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో దారుణం, ఒకే కుటుంబంలో ఆరుగురు హత్య!

Crime

Crime

రోజురోజుకూ మనుషుల్లో మానవతా విలువలు కనిపించకుండాపోతున్నాయి. నా అనుకున్నవారే నమ్మించి మోసం చేస్తున్నారు. డబ్బు వ్యామోహంలో పడి అయినవాళ్లే దారుణంగా చంపేస్తున్నారు. అందుకు ఉదాహరణే ఈ ఘటన.  నిజామాబాద్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్యకు గురి కావడం సంచలనం రేపుతోంది. కేవలం వారం వ్యవధిలోనే ఒక్కొక్కరిని ఓ నిందితుడు హతమార్చారు.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మాక్లుర్ కు చెందిన ప్రసాద్ కుటుంబం గతంలో ఆ గ్రామాన్ని వదిలేసి మాచారెడ్డికి వెళ్ళిపోయి స్థిరపడింది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ప్రసాద్ కు మాక్లుర్ లో ఓ ఇల్లు ఉంది. అయితే ప్రసాద్ కు ప్రశాంత్ అనే స్నేహితుడు ఉన్నాడు. ఇంటికి లోన్ ఇప్పిస్తానని చెప్పి అతని పేర రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. తీరా లోన్ రాకపోగా ఇల్లును తిరిగి తన పేరున రిజిస్ట్రేషన్ చేయాలని ప్రశాంత్ ను ప్రసాద్ ఒత్తిడి చేశాడు.

ఎలాగైనా ఆ ఇంటిని తన సొంతం చేసుకోవాలనుకున్న ప్రశాంత్.. పథకం ప్రకారం ప్రసాద్ ను బయటకు తీసుకెళ్ళి నిజామాబాద్ – కామారెడ్డి జాతీయ రహదారి అటవీ ప్రాంతంలో హత్య చేశాడు. మరుసటి రోజు ప్రసాద్ ఇంటికి వెళ్ళి మీ భర్తను పోలీసులు అరెస్టు చేశారని నమ్మించి ఆమెను బయటకు తీసుకెళ్ళాడు. ఆమెను కూడా హతమార్చి బాసర నదిలో వదిలేశాడు. ఆ తర్వాత ప్రసాద్ పెద్ద సోదరిని హత్య చేశాడు. ఇద్దరు పిల్లలను సోన్ బ్రిడ్జి సమీపంలో.. ప్రసాద్ చిన్న సోదరిని మాచారెడ్డి సమీపంలో హత్య చేసినట్లు సమాచారం. సదాశివ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Parliament security breach: ప్రతిపక్షాల ఆందోళనలు, నినాదాలతో దద్దరిల్లిన పార్లమెంట్