Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అనుకూలించని వాతావరణం

గత రెండు రోజులుగా హైదరాబాద్‌లో వాతావరణం అనూహ్యంగా మారిపోతోంది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాల కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. శుక్రవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించడంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ల్యాండింగ్‌కు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో, ఢిల్లీ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమానానికి ఏటీసీ అనుమతి నిరాకరించింది. దీంతో ఆయన విమానం బెంగళూరుకు వెళ్లాల్సి వచ్చింది. అలాగే, ఢిల్లీ, ముంబయి సహా పలు ప్రాంతాల నుంచి […]

Published By: HashtagU Telugu Desk
Unfavorable weather conditions at Shamshabad Airport.

Unfavorable weather conditions at Shamshabad Airport.

గత రెండు రోజులుగా హైదరాబాద్‌లో వాతావరణం అనూహ్యంగా మారిపోతోంది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాల కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. శుక్రవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించడంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ల్యాండింగ్‌కు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో, ఢిల్లీ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమానానికి ఏటీసీ అనుమతి నిరాకరించింది. దీంతో ఆయన విమానం బెంగళూరుకు వెళ్లాల్సి వచ్చింది. అలాగే, ఢిల్లీ, ముంబయి సహా పలు ప్రాంతాల నుంచి వచ్చిన మరికొన్ని విమానాలను కూడా దారిమళ్లించారు.

శనివారం కూడా ల్యాండింగ్‌కు పరిస్థితులు అనుకూలంగా లేవని అధికారులు వెల్లడించారు. దీంతో కొన్ని విమానాలకు తాత్కాలికంగా అనుమతి నిరాకరించారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. ప్రతికూల వాతావరణం, తక్కువ విజిబిలిటీ కారణంగా శంషాబాద్‌కు రావాల్సిన పలు విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించినట్టు ప్రకటించారు. ముఖ్యంగా ముంబయి, బెంగళూరు, పుణే, నాందేడ్, వారణాసి, ఢిల్లీ, సింగపూర్ తదితర నగరాల నుంచి వచ్చే విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. వీటిలో ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్, ఇండిగో విమాన సర్వీసులు ఉన్నాయి.

దారి మళ్లించిన వాటిలో ఎయిర్ ఇండియా సర్వీసు నంబరు ఏఐ 2875 ముంబయి-హైదరాబాద్, స్పైస్‌జెట్ ఎస్ 5 174 పుణే-హైదరాబాద్, S5 197 నాందేడ్-హైదరాబాద్, ఇండిగో 6E 6683 వారణాసి-హైదరాబాద్, 6E 1028 సింగపూర్-హైదరాబాద్, 6E 638 బెంగళూరు-హైదరాబాద్, 6E 5236 ముంబయి-హైదరాబాద్, 6E 717 ఢిల్లీ-హైదరాబాద్, 6E 2083 నియామే-హైదరాబాద్ సర్వీసులు ఉన్నాయి. మొత్తం 9 సర్వీసుల్లో ముంబయి-హైదరాబాద్, పుణే-హైదరాబాద్, నాందేడ్-హైదరాబాద్, సింగపూర్-హైదరాబాద్, ఢిల్లీ-హైదరాబాద్ విమానాలను బెంగళూరుకు, వారణాసి-హైదరాబాద్ విమానాన్ని చెన్నైకు, బెంగళూరు-హైదరాబాద్ విమానాన్ని నాగ్‌పూర్‌కు మళ్లించినట్టు తెలిపాయి.

శనివారం కూడా హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్టు ఐఎండీ తెలిపింది. సంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్.. నల్లగొండ, మహబూబాబాద్, ఖమ్మం, హైదరాబాద్‌, మేడ్చల్, మెదక్ జిల్లాలకు అరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

 

  Last Updated: 13 Jun 2026, 04:54 PM IST