Bandi Sanjay: సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవాలి, రేవంత్ కు బండి రిక్వెస్ట్‌

  • Written By:
  • Updated On - January 18, 2024 / 10:54 AM IST

Bandi Sanjay: ఉపాధి కరువై.. ఆరోగ్య సమస్యలు తీవ్రమై రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీ (టెక్స్‌టైల్‌పార్క్‌)లో పనిచేసే వలస చేనేత కార్మికుడు సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న విష‌యం తెలిసిందే. దీంతో సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. సిరిసిల్ల జిల్లాలో వస్త్ర పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని.. ఈ రంగంపై ఆధారపడ్డ 20 వేల మంది కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లేఖలో తెలిపారు.

ఈ ప్రాంతంలో మొత్తం 33 వేల మరమగ్గాలుండగా, ఇందులో 28 వేల మగ్గాలపై పాలిస్టర్ వస్త్రాలు, 5 వేల మగ్గాలపై కాటన్ వస్త్రాలు తయారవుతున్నాయని తెలిపారు. ఉత్పత్తి వ్యయం పెరగడం, పాలిస్టర్ బట్టకు గిట్టుబాటు ధర, సరైన మార్కెట్ లేకపోవడంతో సిరిసిల్లలో సాంచాలను బంద్ పెట్టారని గుర్తుచేశారు. దీనికి ప్రధాన కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వంతోపాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలే.

గత ఏడేళ్లుగా ప్రభుత్వ ఆర్డర్లపైనే ఆధార పడి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మనుగడ సాగిస్తోందని.. వస్తోత్పత్తిదారులు సొంతంగా వస్త్ర వ్యాపారం చేయడం లేదన్నారు. బతుకమ్మ చీరలకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులకు రూ.220 కోట్లను బకాయి పెట్టిందని ఆరోపించారు బండి సంజయ్. ఈ బకాయిలు రాకపోవడంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ బకాయిలను చెల్లిస్తామని అప్పటి మంత్రి, స్థానిక శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు పలుమార్లు హామీ ఇచ్చినా చెల్లించలేదన్నారు. చివరకు ఎన్నికల కోడ్ ను సాకుగా చూపి బకాయిలు చెల్లించలేదన్నారు. రేవంత్ ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించి ఆదుకోవాల‌న్నారు.