Caste Enumeration : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కుల గణన కార్యక్రమం చేపట్టనున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే.. రాష్ట్రంలో రేపటి నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం చేపట్టనున్న కులగణన సర్వేలో భాగంగా ప్రాథమిక పాఠశాలల టీచర్లను వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే పనిచేస్తాయి. ఇది రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లకు వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. కులగణన సర్వేలో భాగంగా ఈ స్కూల్స్‌లో ఉన్న టీచర్లు మూడు వారాల పాటు ఈ సర్వేలో పాల్గొంటారు. అందుకే, ప్రాథమిక పాఠశాలలు మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే పనిచేస్తాయని ప్రభుత్వం పేర్కొంది.
ఈ మూడు వారాలు సర్వే నిర్వహణ కోసం పాటించాల్సిన షెడ్యూల్ ప్రకారం, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా ఇవ్వడం తప్పనిసరి అని అధికారులు ఆదేశించారు. ఇటీవల ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 36,559 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు , 3,414 మంది ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ కులగణన సర్వేలో భాగంగా విధులు నిర్వర్తిస్తారు. అయితే, ఈ ఒంటిపూట బడులు కేవలం ప్రాథమిక పాఠశాలలకే వర్తిస్తాయని, హైస్కూళ్లు తన మాములు షెడ్యూల్‌లోనే కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కులగణన సర్వేను ఈ నెల 30వ తేదీకి ముందే పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశించింది.
ఇదిలా ఉంటే.. కొద్దిరోజుల క్రితం ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును తెలంగాణ ప్రభుత్వం గౌరవించి, రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయించింది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పష్టమైన ప్రకటన చేశారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం, ఎస్సీ వర్గీకరణ అమలుపై ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ కమిషన్‌లో విశ్రాంత జడ్జి జస్టిస్ షమీమ్ అక్తర్‌ను చీఫ్‌గా నియమించారు. కమిషన్ పనిచేసి, ఎస్సీ కులాల మధ్య ఉన్న వెనకబాటుతనాన్ని అధ్యయనం చేసి, 60 రోజుల్లో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఈ క్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల కులగణన, వర్గీకరణ వంటి కీలక అంశాలు తెరపైకి వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కులగణన చేపట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల కులాల వారీగా సమగ్ర సర్వే నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ సర్వేను త్వరలోనే ప్రారంభిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also : New Traffic Rules : హైదరాబాద్‌లో నేటి నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్