Singareni : సింగరేణి సంస్థ ప్రయోగాత్మకంగా మరో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించింది. థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి గాలిలోకి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్‌ను సేకరించి, దానికి హైడ్రోజన్‌ను కలిపి మిథనాల్ ద్రవాన్ని తయారు చేసేందుకు ప్రత్యేక ప్లాంటును నిర్మిస్తున్నారు.
Also Read :Kondru Sanjay Murthy: భారత ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’గా కొండ్రు సంజయ్‌మూర్తి.. ఎవరు ?
మంచిర్యాల జిల్లా పెగడపల్లిలో ఉన్న సింగరేణి(Singareni) థర్మల్ విద్యుత్ కేంద్రం పక్కనే దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. థర్మల్ పవర్ ప్లాంట్ చిమ్నీకి అనుబంధంగా ఈ ప్లాంటు నిర్మాణం జరుగుతోంది. ఎందుకంటే చిమ్నీ మార్గం నుంచే కార్బన్ డయాక్సైడ్ బయటికి రిలీజ్ అవుతుంది. ఈవిధంగా ప్రతిరోజు దాదాపు 500 కేజీల కార్బన్ డయాక్సైడ్‌ను సేకరించి, దానికి హైడ్రోజన్‌ను కలపడం ద్వారా 180 కిలోల మిథనాల్ ద్రవం ఉత్పత్తి చేయనున్నారు. మిథనాల్ తయారీ ప్లాంటును సింగరేణి, కోల్ ఇండియా అనుబంధ రీసెర్చ్ యూనిట్ సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్‌స్టిట్యూట్ లిమిటెడ్ (సీఎంపీడీఐఎల్) ఆర్థిక సహకారంతో నిర్మిస్తున్నారు. దీని నిర్మాణ బాధ్యతను, ప్లాంట్ నిర్వహణను బెంగళూరుకు చెందిన జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్, బ్రీత్ అప్లైడ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలకు సింగరేణి అప్పగించింది. మిథనాల్ ప్లాంటు నిర్మాణ పనులు డిసెంబరు 31 నాటికి పూర్తవుతాయి. దీన్ని త్వరలో లాంఛనంగా ప్రారంభించనున్నారు.
Also Read :Ram Charan : ఎఆర్ రెహ్మాన్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రామ్ చరణ్..
మిథనాల్‌ను ఎరువులు, అక్రిలిక్ ప్లాస్టిక్, సింథటిక్ ఫైబర్ వస్త్రాలు, ప్లైవుడ్, పెయింట్స్ తయారీలో వినియోగిస్తారు. ఆయా రంగాల పరిశ్రమలకు మిథనాల్‌ను సింగరేణి అమ్ముకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనదేశంలోని పరిశ్రమల అవసరాల కోసం ఏటా 120 మిలియన్ టన్నుల మిథనాల్‌ను వాడుతున్నారు. ఇందుకోసం ఏటా దాదాపు 80 మిలియన్ టన్నుల మిథనాల్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఒకవేళ సింగరేణిలో మిథనాల్ ఉత్పత్తి మొదలైతే దేశీయ పరిశ్రమల అవసరాలను తీర్చే అవకాశం కలుగుతుంది.