Minister Ponguleti : ‘‘తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కొందరు కోరుతున్నారు’’ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ సూచన మేరకే ప్రభాకర్‌రెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఏర్పడిన వారం నుంచే అధికార దాహంతో కూల్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ మంత్రి పొంగులేటి ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read :Salman Khan : సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపు మెసేజ్ పంపిన వ్యక్తి దొరికాడు.. అయితే !!
కొందరు పగటి కలలు కంటున్నారు..
‘‘ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలుస్తామని కొందరు పగటి కలలు కంటున్నారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి(Minister Ponguleti) కేసీఆర్ ఆత్మ. ఈ ప్రజా ప్రభుత్వంపై మొదటి నుంచే కుట్రలు జరుగుతున్నాయి. వెంటనే సీఎం అయిపోవాలని ఆ తండ్రీకొడుకు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి, ఇందిరమ్మ ప్రభుత్వానికి ప్రజలు మద్దతిచ్చారు. ప్రజలే ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుంటారు’’ అని పొంగులేటి ధ్వజమెత్తారు. ‘‘భూభారతి పోర్టల్ వచ్చినప్పటి నుంచి కొత్త ప్రభాకర్‌రెడ్డి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. గతంలో ఆయన అక్రమంగా భూములు కొల్లగొట్టారు. వాటిని భూభారతి ద్వారా ప్రభుత్వం తిరిగి తీసుకుంటుంది. అందుకే ఆయన భయాందోళనకు గురవుతున్నారు. మేం భూభారతితో పేదల ఆస్తులను తిరిగి పేదలకు పంచి తీరుతాం’’ అని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడాన్ని బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. ‘‘మా ప్రభుత్వం రాష్ట్రంలోని పార్టీలు, మతాలు, కులాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించింది. అర్హులైన అందరికీ సన్న బియ్యం అందిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణపై ఇప్పటికే జీవోను విడుదల చేశాం’’ అని మంత్రి చెప్పారు.
Also Read :Robert Vadra : ఈడీ ఎదుటకు రాబర్ట్ వాద్రా.. ఆయనపై అభియోగం ఏమిటి ?
కుట్ర కోణం ఉంటే చర్యలు : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలను తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఖండించారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలనే యత్నాన్ని కుట్రకోణంగా భావిస్తున్నామని ఆయన అన్నారు.ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరుతామన్నారు. కుట్రకోణం ఉన్నట్టు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.