Rythu Bandhu : ఏడో రోజు శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలోనే అసెంబ్లీలో రైతు భరోసా విధి, విధానాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. అబద్దాల సంఘానికి అధ్యక్షుడు సభకు రాలేదు.. ఉపాధ్యక్షుడు సభకు వచ్చి రైతు ఆత్మహత్యల పై అబద్ధాలు చెబుతున్నారు అని సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్ల పాలన పై సభ్యులకు సభలో సమాధానం చెప్పాల్సి వస్తుందేమోనని సభకు రాలేదని సీఎం అన్నారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ వచ్చి రైతు బంధు పై సలహాలు, సూచనలు ఇస్తారనుకున్నా. బీఆర్ఎస్ నేతలు నకిలీ పట్టాలతో రైతు బంధు తీసుకున్నారు. మీరు అంతా మంచి చేసి ఉంటే ప్రతిపక్షంలో ఎందుకు కూర్చుంటారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
రాళ్లకు, రప్పలకు, గుట్టలకు రైతు భరోసా ఇద్దామా..? అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. క్రషర్ యూనిట్లకు, మైనింగ్ భూములకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా రైతు బంధు ఇవ్వాలా..? అని ప్రశ్నించారు. గజ్వేల్ నియోజకవర్గంలో రాజీవ్ రహదారి వేసిన భూములకు కూడా రైతు బంధు ఇచ్చారని తెలిపారు. మమ్మల్ని ఆదర్శంగా తీసుకుని రైతు భరోసా ఇవ్వాలని అంటున్నారు. మీరు కాదు మాకు ఆదర్శం. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే మేము ఇక్కడ ఉండేవారం కాదు.. 2023లో ఓడి పోయారు. ఆ తర్వాత డిపాజిట్లు పోయాయి. ఇకముందు ఊడ్చుకుపోతారు. ప్రతీ పక్ష నేతలు చెప్పకపోయినా.. వారు రాత పూర్వకంగా ఏమైనా సలహాలు, సూచనలు ఇచ్చినా వాటిని పరిగణలోకి తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలకు పోవడం వల్ల అనర్హులకు ఆయాచిత లబ్ధి జరిగిందని అన్నారు. రూ. 22,606 కోట్లు సాగు చేయని భూములకు రైతుబంధు అందిందని చెప్పారు. దొంగ పాస్ పుస్తకాలు తయారు చేసి రైతుబంధు తీసుకున్నారు. గత ప్రభుత్వ పెద్దల అనుచరులం, బంధువులం అని వేల కోట్లు కొల్లగొట్టారు. 80వేల పుస్తకాలు చదివినవారు వచ్చి రైతు భరోసాపై సలహా ఇస్తారు అనుకున్నాం..అన్నారు. బీఆర్ఎస్ చిత్ర, విచిత్ర వ్యవహారాలను ప్రజలు గమనిస్తున్నారు. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలో మీ సూచనలు చెప్పండి అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.