Kavitha Custody : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు షాక్ తగిలింది. ఆమె జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. కవిత బయటకు వెళితే.. కేసు దర్యాప్తును ప్రభావితం చేస్తారని ఈడీ ఆందోళన వ్యక్తం చేయడంతో ఆమెకు విధించిన జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 23 వరకు పొడిగిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం కవిత తిహార్ జైలులో ఉన్నారు. ఇంతకుముందు ఆమెకు విధించిన కస్టడీ గడువు ముగియడంతో ఆమెను ఈడీ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో కవితకు మరో 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
We’re now on WhatsApp. Click to Join
ఇవాళ కోర్టులో కవిత తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘‘కస్టడీ పొడిగింపు(Kavitha Custody) కోరేందుకు ఈడీ వద్ద కొత్తగా ఏమీ లేదు’’ అని తెలిపారు. కోర్టులో నేరుగా మాట్లాడేందుకు కవిత అనుమతి కోరగా.. జడ్జి కావేరి బవేజా నిరాకరించారు. నిందితురాలికి మాట్లాడే హక్కు ఉందని కవిత తరఫు న్యాయవాది వాదించగా.. అందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుందని జడ్జి తెలిపారు. కోర్టు హాలులో భర్త అనిల్, మామ రామకిషన్‌రావును కలిసేందుకు కవిత తరఫున న్యాయవాదులు దరఖాస్తు చేయగా అందుకు న్యాయమూర్తి అనుమతి మంజూరు చేశారు. దీంతో కవితను ఆమె భర్త అనిల్, మామ కిషన్ రావు కలిసి మాట్లాడారు. యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
Also Read :Family Star : ఫ్యామిలీ స్టార్ నుంచి తప్పించుకున్న ఆ హీరో..?
ఇక ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నుంచి తిహార్ జైలుకు తరలించే సమయంలో కోర్టు ఆవరణలో కవిత విలేకరులతో మాట్లాడటానికి ప్రయత్నించారు. తనపై నమోదు చేసిన కేసు, అందులో పొందుపరిచిన స్టేట్‌మెంట్లన్నీ పూర్తిగా రాజకీయపరమైనవే అని ఆమె తెలిపారు. ప్రతిపక్ష పార్టీలపై రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఇదంతా చేస్తున్నారని చెప్పారు. సీబీఐ ఇప్పటికే జైల్లో తన వాంగ్మూలాన్ని నమోదు చేసిందని పేర్కొన్నారు.