తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేసినా సంచలనంగానే ఉంటుంది. అందుకే ఇప్పుడు జాతీయ రాజకీయాలపై ఆయన వేస్తున్న స్కెచ్ లు కూడా అలానే ఉన్నాయి. నేషనల్ పాలిటిక్స్‌లో ఎంట్రీపై కేసీఆర్ చాలా సీరియస్‌గానే పనిచేస్తున్నారు. ఇప్పటివరకయితే ఆయన దృష్టి అంతా మార్చి పదో తేదీపైనే ఉంది. ఆ రోజు అయిదు అసెంబ్లీల ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఆ తరువాత కేసీఆర్ మాట, బాట మరింత స్పష్టంగా ఉండనుంది.
బీజేపీకి చెప్పుకోదగిన ఫలితాలేమీ రావని, జాతీయ స్థాయిలో ఆల్టర్నేటివ్ ఫ్రంట్‌కు అవకాశాలు బాగా ఉన్నాయని ఆయన అంచనా వేస్తున్నారు. దీన్ని ఆధారం చేసుకునే ఆయన గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటకల్లో రాజకీయ పరపతి ఉన్న ప్రముఖ సినీనటుడు ప్రకాశ్ రాజ్‌తో చర్చలు జరపడం ఇందులో భాగమే. ఆయనను ఎర్రవెల్లిలోని ఫాంహౌస్‌కు ఆహ్వనించి ఏకంగా నాలుగు గంటల పాటు చర్చలు జరపడం అందరిలో చర్చకు దారితీసింది.
నేషనల్ లెవల్లో టీఆర్ఎస్ వ్యవహారాలను పరిశీలించడానికి ఒక కమిటీని వేయాలని, అందులో ప్రకాశ్ రాజ్‌కు చోటు కల్పించాలని అనుకున్నట్టు తెలిసింది. త్వరలో బెంగళూరు, భువనేశ్వర్, ఢిల్లీల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. అందులో ప్రకాశ్ రాజ్‌కు వెంట తీసుకునే వెళ్లే అవకాశం ఉంది. ఢిల్లీ, ఒడిశా సీఎంలు కేజ్రీవాల్, నవీన్ పట్నాయక్‌లతో చర్చలు జరిపి ఆల్టర్నేటివ్ పొలిటికల్ ఫ్రంట్ ఏర్పాటుపై అభిప్రాయాలు పంచుకోనున్నారు.
బీజేపీ ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని చెప్పడం ప్రధాన అంశంగా ఉండనుంది. తమిళనాడు, కర్ణాటకల్లో కోఆర్డినేట్ చేయడానికి ప్రకాశ్ రాజ్ సేవలను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత వాటిని బేస్ చేసుకొని దూకుడు పెంచనున్నారు.