Food Safety : తెలంగాణలోని పలు హోటళ్లలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఆహార భద్రత అధికారులు నిర్వహించిన తనిఖీల్లో నివ్వెరపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. గత 20 రోజులుగా 67 చోట్ల సోదాలు చేపట్టగా, సగానికిపైగా చోట్ల నిబంధనల ఉల్లంఘనలను, ఆహార కల్తీ వైనాలను గుర్తించారు. చెడిపోయిన పదార్థాలు, బూజుపట్టిన కూరగాయలు, ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచిన పదార్థాలను హోటళ్లలో విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. పలుచోట్ల నకిలీ బ్రాండ్‌ల వాటర్ బాటిళ్లు, కోల్డ్ చైన్ లేకుండా నిల్వ ఉంచిన ఐటమ్స్, కాలం చెల్లిన మసాలాలు, బ్రెడ్‌లు, కల్తీ పదార్థాలు, గడువు తీరిన చాక్లెట్లను అధికారులు తనిఖీల్లో(Food Safety) గుర్తించారు. తెలంగాణలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, మండీలు, ఐస్‌క్రీం పార్లర్లు, కాఫీ షాప్‌లలోనూ ఇదే పరిస్థితి నెలకొందని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join
హైదరాబాద్‌లోని లక్డీకాపూల్‌లో నిర్వహిస్తున్న ఓ రెస్టారెంట్‌లో పురుగులు పట్టిన మైదా, చింతపండు సహా ఇతర పదార్థాలను, గడువు తీరిన పాల ప్యాకెట్లను వినియోగిస్తున్నారని వెల్లడైంది. జూబ్లీహిల్స్‌లోని ఓ బార్ అండ్ కిచెన్‌లో వినియోగిస్తున్న పదార్థాల్లో గడువు ముగిసినవే ఎక్కువగా ఉన్నాయని తేలింది. బంజారాహిల్స్‌లోని ఓ పెద్ద మాల్‌లోని పేరొందిన ఫుడ్‌స్టాళ్లలోని ఆహారంలో నాణ్యత లేదని గుర్తించారు. హైదరాబాద్ బార్కస్‌లోని ఒక ఇండో అరబిక్ రెస్టారెంట్‌లో కాలం చెల్లిన ఆహార పదార్థాలు వినియోగిస్తున్నారు. లేబుళ్లు లేని వాటర్ బాటిళ్లు విక్రయిస్తున్నారు.
Also Read :Chicken Price : చుక్కలు చూపిస్తున్న చికెన్ రేట్లు.. ఎందుకు ?
హైదరాబాద్‌లోని ఓ ఐస్‌క్రీం ఔట్‌లెట్‌లో కాలం చెల్లిన స్ట్రాబెర్రీ పేస్ట్, నిల్వ నిబంధనలు పాటించని పైనాపిల్ టిట్‌బిట్ క్యాన్‌లను గుర్తించారు. జహీరాబాద్ సమీపంలోని ఒక దాబాలో నూనెను ఎన్నిసార్లు వినియోగించారో గుర్తించలేని పరిస్థితి. గతేడాది జీహెచ్‌ఎంసీ పరిధిలోని హోటళ్లలో దాదాపు 14,889 శాంపిళ్లను అధికారులు సేకరించగా.. వీటిలో 3,803 శాంపిళ్లకు సంబంధించి నాణ్యతను బెటర్ చేసుకోవాలని సూచించారు. 2,534 శాంపిళ్లు నాణ్యత లేనివని, 311 శాంపిళ్లు కల్తీ అయినవని నిర్ధారించారు.