Karregutta Vs Maoists : కర్రెగుట్ట.. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని అభయారణ్యంలో ఉంది. ‘‘ములుగు జిల్లా పరిధిలోని కర్రె గుట్టపై పెద్దసంఖ్యలో ల్యాండ్ మైన్స్‌ను ఏర్పాటు చేశాం. ఎవరూ ఈ గుట్టపైకి రావొద్దు’’ అంటూ మావోయిస్టులు సంచలన లేఖను విడుదల చేశారు. పోలీసులు, భద్రతా బలగాలు కర్రెగుట్టపై ఆపరేషన్ కగార్‌ను మొదలుపెట్టిన నేపథ్యంలో తాము వందలాదిగా ల్యాండ్ మైన్స్‌ను ఏర్పాటు చేశామని మావోయిస్టులు వెల్లడించారు. ఈమేరకు వివరాలతో సీపీఐ మావోయిస్టు పార్టీ వెంకటాపురం–వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరుతో ఓ లేఖ విడుదలైంది. షికారు పేరుతో కర్రెగుట్టపైకి వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవద్దని ప్రజలకు మావోయిస్టులు సూచించారు. దీంతో పరిసర ప్రాంతాల ప్రజల్లో భయాందోళన వ్యక్తమవుతోంది.
Also Read :One State One RRB : మే 1 నుంచే ‘వన్ స్టేట్ వన్ ఆర్‌ఆర్‌బీ’.. ఏపీలో ఒకే ఒక్క ఆర్‌ఆర్‌బీ
‘‘ఇన్‌ఫార్మర్లుగా మారి కుటుంబాలను కష్టాలపాలు చేయకండి’’
‘‘పోలీసుల మాటలు నమ్మి ఎవరూ ఇన్ ఫార్మర్లుగా మారొద్దు. ఇన్ ఫార్మర్లుగా మారి కుటుంబాలను కష్టాలపాలు చేయకండి’’ అని మావోయిస్టులు కోరారు. ‘‘ఆపరేషన్ కగార్ పేరుతో పోలీసులు, భద్రతా బలగాలు చేస్తున్న దాడుల్లో అనేక మంది మావోయిస్టు పార్టీ నేతలు, పీఎల్జీఏ నాయకులతో పాటు సాధారణ ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. బూటకపు ఎన్ కౌంటర్లలో అమరులు అవుతున్న వారిలో ఎక్కువ మంది ఆదివాసీ ప్రజలే ఉంటున్నారు. ఈ ఆపరేషన్ కగార్ నుంచి రక్షణ పొందడానికే కర్రెగుట్టపై బాంబులు అమర్చాం’’ అని లేఖలో మావోయిస్టులు(Karregutta Vs Maoists) స్పష్టం చేశారు.
Also Read :YS Jagans Helicopter: హెలికాప్టర్ డ్యామేజ్.. రోడ్డు మార్గంలో బెంగళూరుకు జగన్.. ఏమైంది ?
కర్రెగుట్టలు.. కీలక విషయాలు
- ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం ప్రాంతాలకు సమీపంలోని దట్టమైన అడవుల్లో కర్రెగుట్టలు ఉన్నాయి. వీటికి అత్యంత సమీపంలోనే ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర బార్డర్ కూడా ఉంది.
- ఇంద్రావతి నది గోదావరిలో కలిసే చోటు నుంచి ప్రారంభమయ్యే కర్రెగుట్టలు తాలిపేరు వాగు గోదావరిలో కలిసే వరకు విస్తరించి ఉంటాయి. అంటే ఇంచుమించు 100 కిలోమీటర్ల పొడవునా వ్యాపించి ఉంటాయి. ఈ గుట్టల మధ్య పుష్కలమైన జలవనరులున్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని మావోయిస్టులు షెల్టర్‌గా ఏర్పాటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది.
- కర్రెగుట్ట సమీపంలోనే బీజాపూర్ జిల్లాలో బెడెం మల్లన్న స్వామి ఆలయం ఉంది. అక్కడికి గిరిజనులు ఏటా వెళ్తుంటారు. అడవిలో దాదాపు 40 కిలోమీటర్లు నడిస్తే కానీ ఆలయాన్ని చేరరు.
- ఈ మార్గంలో ఇప్పుడు మావోయిస్టులు పెద్దసంఖ్యలో ల్యాండ్ మైన్స్ ఏర్పాటు చేశారని తెలుస్తోంది. వీటిపై అడుగుపెట్టగానే పేలుతాయి. ల్యాండ్ మైన్స్ పేలుడు వల్ల మనుషులతో పాటు వన్యప్రాణులు కూడా గతంలో మృత్యువాత పడ్డాయి. అందుకే ఇప్పుడు కర్రెగుట్ట వైపు వెళ్లాలంటేనే గిరిజనులు వణికిపోతున్నారు.
- నిత్యం అడవిపై ఆధారపడి జీవించే ఆదివాసీలు వంటచెరుకు, ఇతర పనుల కోసం అడవిలోకి వెళ్తుంటారు.
- ములుగు జిల్లా పోలీసులు కర్రెగుట్టలో కూంబింగ్‌ను పెంచారు.