Robbers In Trains : సంక్రాంతి వేళ రైళ్ల నుంచి బస్సుల దాకా.. బస్సుల నుంచి విమానాల దాకా ప్రతీచోటా ప్రయాణికుల రద్దీ ఉంది. ఈ భారీ రద్దీని దొంగలు అదునుగా వాడుకుంటున్నారు. దొంగతనాలకు తెగబడుతున్నారు. ప్రత్యేకించి రైళ్లలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు హల్‌చల్ చేస్తున్నాయట. బంగారు ఆభరణాలు, పర్సులు, స్మార్ట్‌ఫోన్లు, హ్యాండ్ బ్యాగులు, లగేజీ బ్యాగులు వంటి వాటిని వాళ్లు టార్గెట్ చేస్తారట. అందుకే రైళ్లలో ప్రయాణించే వారు కాస్త జాగ్రత్తగా ఉండాలని రైల్వే పోలీసులు సూచిస్తున్నారు.
Also Read :Handloom Mark : తెలంగాణ చేనేత వస్త్రాలపై ఇక ‘హ్యాండ్లూమ్ మార్క్’.. ఏమిటిది ?
తీరొక్క దొంగలు
- మహిళల మెడలోని గొలుసులను లాగే చైన్ స్నాచర్ బ్యాచ్‌లు కూడా ట్రైన్లలో(Robbers In Trains) తిరుగుతున్నాయట. అందుకే మహిళలు ప్రయాణాల్లో ఉన్నప్పుడు బంగారు ఆభరణాలు ధరించకపోవడం మంచిదని రైల్వే పోలీసులు అంటున్నారు.
- బంగారు ఆభరణాలు, నగదును ఇంట్లో వదిలేస్తే దొంగలు పడతారనే భయంతో చాలామంది మహిళలు వాటిని తమతోనే తీసుకెళ్తుంటారు. అలాంటి వారిని కూడా దొంగలు టార్గెట్ చేసే అవకాశాలు ఉంటాయి.
- కొంతమంది ప్రయాణికులు రైలులోని కిటీకీలు, డోర్ల వద్ద కూర్చొని సెల్‌ఫోన్లలో మాట్లాడుతుంటారు. దొంగలు ఇలాంటి వాళ్ల నుంచి స్మార్ట్ ఫోన్లను కాజేసి పారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయట.
- ఇరానీ, హర్యానా దొంగల ముఠాలు చాలా తెలివిగా వ్యవహరిస్తుంటాయి. ఈ ముఠాల్లోని దొంగలు తొలుత తాము టార్గెట్‌గా చేసుకున్న ప్రయాణికుడి దృష్టిని మరలుస్తారు. అనంతరం చోరీకి పాల్పడి క్షణాల్లో పరార్ అవుతారు.
- రైలులోకి ఎక్కేందుకు ప్రయాణికులు పోటీ పడే టైంలో కొందరు దొంగలు తమ పని కానిచ్చేస్తుంటారు. పర్సులు, ఫోన్లు కాజేస్తుంటారు.
- చాలామంది ప్రయాణికులు రైళ్లలో నిద్రపోతుంటారు. ప్రత్యేకించి రైళ్ల జనరల్ బోగీల్లో నిద్రపోయే ప్రయాణికులను పార్దీగ్యాంగ్ దొంగలు టార్గెట్ చేస్తుంటారు. వారు నిద్రలోకి జారుకోగానే.. పర్సులు, ఫోన్లను చోరీ చేసి పారిపోతుంటారు.
- సికింద్రాబాద్ జీఆర్పీ జిల్లా పరిధిలో జరిగిన చోరీల్లో ఎక్కువ భాగం పండుగ టైంలో జరిగినవే.
- సికింద్రాబాద్ జీఆర్పీ జిల్లా పరిధిలో 2023లో రైళ్లలో 939 చోరీలు జరిగాయి. రూ.3.67 కోట్ల సొత్తు పోయింది. కేవలం రూ.50 లక్షలను రికవర్ చేశారు.
- సికింద్రాబాద్ జీఆర్పీ జిల్లా పరిధిలో 2024లో రైళ్లలో 983 చోరీలు జరిగాయి. రూ.3.67 కోట్ల సొత్తు పోయింది. కేవలం రూ.43 లక్షలను రికవర్ చేశారు.
- రైల్వే స్టేషన్లు, రైళ్లలో దొంగతనాలు వంటివి జరిగితే టోల్‌ఫ్రీ నంబరు 139కు కాల్ చేయొచ్చు.