Rythu Bharosa : రైతునేస్తం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధుల చెల్లింపును శరవేగంగా అమలు చేస్తోంది. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు 9 రోజుల్లో రూ.9,000 కోట్లు జమ చేస్తామని సీఎం ఇచ్చిన హామీ ప్రకారం, ఇప్పటికే నాలుగు రోజుల్లోనే రూ.6,405 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది.
జూన్ 16న ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రైతునేస్తం వేదికగా ప్రారంభమైన వానాకాలం రైతు భరోసా చెల్లింపులు క్రమంగా కొనసాగుతున్నాయి. తొలి రోజు రెండెకరాల వరకున్న రైతులకు, ఆపై మూడు, నాలుగు, ఐదు ఎకరాల వరకున్న రైతులకు విడతల వారీగా నిధులు విడుదల చేశారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 62.47 లక్షల మంది రైతులకు భరోసా నిధులు అందాయి.
ఈ సారి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పరిమితులు విధించకుండా, సాగు భూముల మొత్తం విస్తీర్ణానికి పెట్టుబడి సాయాన్ని ఇవ్వనుంది. మొత్తం కోటిన్నర ఎకరాలకు ఎకరానికి రూ.6 వేల చొప్పున చెల్లించేందుకు ప్రభుత్వం రూ.9 వేల కోట్ల నిధుల సమీకరణ చేపట్టింది. ఇందులో కొంత భాగాన్ని రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పుగా, మిగతా భాగాన్ని ఇతర ఆదాయ వనరుల ద్వారా సమకూర్చింది.
ఇప్పటికే కోటి ఎకరాల పైచిలుకు భూమికి రైతు భరోసా చెల్లింపులు పూర్తవగా, మిగతా 50 లక్షల ఎకరాలకు మరో ఐదు–ఆరు రోజుల్లో నిధులు జమ కానున్నాయని అధికారులు తెలిపారు. ఈ సాయం వానాకాలం పంటల సాగు ఖర్చులకు ఎంతో ఉపయోగపడనుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ స్థాయిలో వేగంగా, విస్తృతంగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
Vivo Y400 Pro: భారత విపణిలోకి వివో వై400 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్