Site icon HashtagU Telugu

CM Revanth Reddy: సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులకు సీఎం రేవంత్ లక్ష సాయం

CM Revanth Reddy

CM Revanth Reddy

CM Revanth Reddy: సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ తెలిపారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మేరకు ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకాన్ని ప్రారంభించారు. ప్రజా భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సింగరేణి సీఎండీ బలరాం పాల్గొన్నారు.

పోటీ పరీక్షలలో విజయం సాధించేందుకు ఔత్సాహిక సివిల్ సర్వెంట్‌లకు మద్దతుగా ఇది ఉపయోగపడనుంది. అభయహస్తం పథకానికి సంబంధించిన దరఖాస్తులను ముఖ్యమంత్రి విడుదల చేశారు, అర్హులైన అభ్యర్థులు ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించారు.అధికారిక సమాచారం ప్రకారం తెలంగాణ నుండి ప్రతి సంవత్సరం సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు సుమారు 50000 మంది అభ్యర్థులు నమోదు చేసుకుంటారు. 400-500 మంది విద్యార్థులు తదుపరి రౌండ్‌కు అర్హత సాధిస్తారు.

VIDEO:  https://x.com/i/status/1814563803339858115

అర్హత ప్రమాణం:
అభ్యర్థులు తప్పనిసరిగా తెలంగాణలో శాశ్వత నివాసి అయి ఉండాలి
వారు తప్పనిసరిగా జనరల్ (EWS కోటా)/ BC/SC/ST వర్గాల నుండి ఉండాలి
వారు తప్పనిసరిగా UPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష యొక్క ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించాలి
అభ్యర్థుల కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలు దాటకూడదు. వారు కేంద్ర, లేదా రాష్ట్ర ప్రభుత్వాలలో ఉద్యోగులు కాకూడదు
అభ్యర్థులు ఒక్కసారి మాత్రమే ఈ ఆర్థిక సహాయానికి అర్హులు

90 రోజుల్లో 30 వేల ఖాళీలను భర్తీ చేశాం:
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న పోరాటం వెనుక ఉద్యోగాలే ప్రధాన కారణమని వ్యాఖ్యానించారు.90 రోజుల వ్యవధిలో 30000 ఖాళీలను భర్తీ చేసామని గుర్తు చేశారు. తెలంగాణ నిరుద్యోగుల బాధలను అర్ధం చేసుకున్నాం కాబట్టే అధికారంలోకి రాగానే వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసి టీజీపీఎస్సీని పునర్వ్యవస్థీకరించామని చెప్పారు సీఎం.గత 10 ఏళ్లలో ఏనాడూ నోటిఫికేషన్‌ల ప్రకారం పరీక్షలు నిర్వహించలేదని బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు.

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగ క్యాలెండర్‌ను ప్రవేశపెడతామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. మార్చి నాటికి అన్ని శాఖల నుండి ఖాళీల వివరాలను సేకరిస్తామని, అలాగే జూన్ 2 నాటికి నోటిఫికేషన్లు జారీ చేస్తామన్నారు. అలాగే డిసెంబర్ 9 నాటికి నియామక ప్రక్రియ పూర్తవుతుందని హామీ ఇచ్చారు సీఎం.

Also Read: Nara Lokesh: సౌదీ అరేబియాలో చిక్కుకున్న వీరేంద్ర, రంగంలోకి మంత్రి లోకేష్

Exit mobile version