Rise of Revanth Reddy.. : రైజ్ ఆఫ్ రేవంత్..

రేవంత్ రెడ్డి (Revanth Reddy), రాజకీయ నేపథ్యం లేని ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. హైదరాబాదులోని ఏవీ కాలేజీలో ఆయన బ్యాచిలర్ డిగ్రీ చేశాడు.

  • Written By:
  • Updated On - December 7, 2023 / 02:27 PM IST

By: డా. ప్రసాదమూర్తి

Rise of Revanth Reddy.. : రాజకీయాల్లో కెరటాలు పడి లేస్తాయి, లేచి పడతాయి. తెలంగాణ స్వతంత్ర రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత మూడో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డిని వడివడిగా పైకి లేచిన కెరటంతో పోల్చాలి. దాదాపు 2001- 2002 మధ్యకాలంలో కేసీఆర్ నాయకత్వం కింద రాజకీయ అరంగేట్రం చేసి, అదే కేసీఆర్ ని గద్దె దించడమే తన ప్రధాన ధ్యేయంగా మార్చుకొని రాజకీయాల్లో అతి వేగంగా పైకి ఎదిగిన యువ నాయకుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy). దాదాపు 8 సంవత్సరాల క్రితం కేసీఆర్ను సింహాసనం నుండి కూలదొయ్యడమే తన ప్రధాన ధ్యేయమని ప్రకటించిన రేవంత్ రెడ్డి ఎట్టకేలకు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయపథం వైపు నడిపించి తను చేసిన ప్రతిజ్ఞను నిరూపించుకున్నారు. దృఢమైన రాజకీయ ఆకాంక్షలతో అంచెలంచెలుగా పైకి ఎదిగిన 54 సంవత్సరాల రేవంత్ రెడ్డి (Reventh Reddy) తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన మూడేళ్లకే పార్టీని బలోపేతం చేసి విజయతీరాల వైపు నడిపించి తాను ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. ఎలా ఇది సాధ్యమైంది? ఇంత తక్కువ కాలంలో ఇంత అద్భుతమైన విజయాన్ని రేవంత్ ఎలా తన సొంతం చేసుకున్నారు? ఒకసారి చూద్దాం..

రేవంత్ రెడ్డి (Revanth Reddy), రాజకీయ నేపథ్యం లేని ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. హైదరాబాదులోని ఏవీ కాలేజీలో ఆయన బ్యాచిలర్ డిగ్రీ చేశాడు. కాలేజీ విద్యార్థిగా రేవంత్ ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి సంస్థ ఏబీవీపీతో పని చేసాడు. విద్యాభ్యాసం తర్వాత రేవంత్ కొంతకాలం రియల్ ఎస్టేట్ బిజినెస్ లో కొనసాగి 2001- 2002 మధ్యకాలంలో కేసీఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ పార్టీలో సభ్యుడిగా చేరారు. ఆ పార్టీలో తనకంత గుర్తింపు లభించకపోవడంతో 2006లో పార్టీకి రాజీనామా చేశారు. తర్వాత మహబూబ్ నగర్ మిడ్జిల్ మండల్ టెరిటోరియల్ నియోజకవర్గ జిల్లా పరిషత్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. వెంటనే 2007లో మహబూబ్నగర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీగా నిలబడి గెలుపు సాధించారు. తదనంతరం ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. 2009లో కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన మొదటి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. కానీ 2018లో కేసీఆర్ ప్రభంజనం లో ఆయన ఓటమి పాలయ్యారు.

We’re Now on WhatsApp. Click to Join.

రేవంత్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకుడు జైపాల్ రెడ్డి కూతురైన గీతను వివాహమాడారు. రాజకీయ విభేదాల మాట ఎలా ఉన్నా సామాజిక బాధ్యతను రాజకీయ బాధ్యతను సమతుల్యం చేయడంలో రేవంత్ పరిపక్వత సాధించిన నేతగా అప్పటికే ఆయన రాజకీయ వర్గాల్లో పేరు సంపాదించుకున్నారు. తనకు దక్కిన ఏ ఒక్క అవకాశాన్నీ ఆయన దుర్వినియోగం చేసుకోలేదు. వేసిన ప్రతి అడుగూ రాజకీయ వైకుంఠపాళీ లో పైపైకి ఎదిగే దిశగానే సాగించాడు. ఎమ్మెల్సీగా రేవంత్ ఆనాటి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని చట్టసభలో అత్యంత ధీటుగా ఎదుర్కొని చంద్రబాబు ఆశీస్సులు పొందగలిగాడు. వైయస్సార్ పాలనా కాలంలో జరిగిన జలయజ్ఞం కుంభకోణంపై లోతైన పరిశోధనలు చేసి ప్రభుత్వాన్ని ఢీకొన్న యువనేతగా అప్పటికే పేరు సాధించాడు. ఆ అనుభవమే ఇటీవల కాలంలో కేసీఆర్ సాగించిన కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులలో జరిగిన కుంభకోణాలను వెలికి తీయడంలో కలిసి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014లో కేసీఆర్ తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు.

రేవంత్ రెడ్డి లోని నాయకత్వ ప్రతిభ, వాగ్ధాటి, రాజకీయ నైపుణ్యం చూసి చంద్రబాబు నాయుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీకి రేవంత్ రెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేశారు. ఆనాడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో 15 స్థానాలు సాధించింది. అంతేకాదు ముందుకు దూసుకుపోతున్న రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ క్రమక్రమంగా కెసిఆర్ కి ప్రమాదంగా మారుతూ వచ్చింది. ఈ ప్రమాదాన్ని అప్పటికే పసిగట్టిన కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు అనే కేసులో ఇరికించి 2017లో జైలుకు పంపించారు. టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతుగా ఓటు వేయడానికి నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్ కు డబ్బు ఇస్తూ రేవంత్ పట్టుబడ్డారు. ఈ కేసులో ఆయన్ని అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు పంపించారు. తన కూతురు నైమిషా వివాహం జరుగుతున్న సందర్భంలో రేవంత్ కు ఈ విషాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. కూతురు నిశ్చితార్థానికి, వివాహానికి ఆయన జైలు అనుమతితో హాజరయ్యారు.

Also Read:  Cyberabad: ఇయర్ ఎండ్ పార్టీలు చేసుకుంటున్నారా.. పోలీస్ పర్మిషన్ మస్ట్!

రేవంత్ దూకుడు, తెలుగుదేశం పార్టీ ప్రజలలో ఇంకా బలంగా వేళ్ళూనుకుని ఉండడం గమనించిన కేసీఆర్, తెలుగుదేశం పార్టీని తెలంగాణలో నామరూపాలు లేకుండా చేయాలన్న పథకంలో భాగంగానే రేవంత్ ని జైలుకు పంపించారు. ఆ పథకంలో కేసీఆర్ విజయం సాధించినా, జైలు నుంచి బెయిల్ మీద వచ్చిన మరుక్షణమే రేవంత్ ఏనాటికైనా కేసీఆర్ ని పదవీచ్యుతుణ్ణి చేసి తన పగ తీర్చుకుంటానని ప్రతినబూనాడు. 2018 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేసిఆర్ పన్నిన సెంటిమెంట్ వ్యూహంలో చిక్కుకొని ఘోర పరాజయానికి గురైంది. దాదాపు పది మంది టిడిపి ఎమ్మెల్యేలను కేసిఆర్ తన పార్టీ వైపు లాక్కొని, ఆ పార్టీ ఉనికి లేకుండా చేయడానికి అన్ని ప్రయత్నాలూ చేశారు. తెలంగాణలో నానాటికి తెలుగుదేశం ప్రభ తగ్గుతూ రావడం గమనించిన రేవంత్ 2017 లో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ ఉపన్యాసాలలో జోరు..హోరు.. లోతైన పరిశీలన, పరిశోధనతో కేసిఆర్ ని ఎదుర్కొంటున్న తీరు.. కాంగ్రెస్ పార్టీ అధినాయకులను ఆకర్షించింది. ఐదు సంవత్సరాల్లోనే రేవంత్ కాంగ్రెస్ పార్టీలో అగ్రగామినేతగా ఎదిగి పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను చేసినప్పుడు తెలంగాణలో అశేషంగా ప్రజా సందోహాలను ఆ యాత్రలో పాల్గొనేలా చేసి రేవంత్ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా అతి తక్కువ కాలంలో చేరువైపోయారు.

పార్టీలో ఉన్న సీనియర్లు కళ్ళప్పగించి చూస్తూ ఉండగానే రేవంత్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అత్యంత ప్రియమైన నాయకుడిగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీలో వేసిన ప్రతి అడుగూ ఆయనకు ఒక విజయ సోపానంగా మారింది. ముఖ్యమంత్రి పీఠమే తన ధ్యేయం, ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆ పీఠం నుంచి దించడమే తన లక్ష్యం. ఈ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి రేవంత్ అహోరాత్రాలు కష్టపడ్డారు. ఒకపక్క దశాబ్దాలుగా పార్టీలో పనిచేస్తున్న సీనియర్ల అవరోధాలు, బయట నుంచి పార్టీలోకి వచ్చి ఇంత త్వరగా ఉన్నత స్థానాన్ని అధిరోహించాడు అన్న ఈర్ష్యా వ్యాఖ్యలు, అధికార పార్టీ తన మీద కురిపిస్తున్న ఆర్ఎస్ఎస్ ఆరోపణలు.. మొదలైన ఎన్నెన్నో అడ్డుగోడల్ని కూల్చుకుంటూ చివరికి తన పార్టీని విజయం వైపు నడిపించి, ముఖ్యమంత్రి కావాలన్న తన ధ్యేయాన్ని నెరవేర్చుకొని స్వతంత్ర తెలంగాణకు మూడో ముఖ్యమంత్రిగా ఇప్పుడు ప్రమాణం చేశారు. ప్రమాణం చేయడం ఒక ఎత్తు. చేసిన ప్రమాణాలు నిలబెట్టుకొని సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మచ్చలేని నాయకునిగా చరిత్ర పుటల్లో నిలవడం మరొక ఎత్తు.

ఇప్పటిదాకా కష్టపడింది ఒక రకమైతే, రేవంత్ ఇకముందు కష్టపడాల్సింది దానికి 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కష్టే ఫలే అన్నారు. కేవలం కష్టమే కాదు, దానికి నిజాయితీ కూడా తోడైతే ఆ నాయకుడు తప్పనిసరిగా ప్రజా నాయకుడిగా వర్ధిల్లుతాడు. చూడాలి. రానున్న కాలాన్ని రేవంత్ తనకి అనుకూలంగా ఎలా మలుచుకుంటాడో.. మరిన్ని విజయ సోపానాలు ఎలా అధిరోహిస్తాడో.

Also Read:  Revanth Reddy Ceremony Live