ఇంద్రవెల్లి సభ (Indravelli Meeting)లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బిఆర్ఎస్ నేతల(BRS Leaders)పై కీలక వ్యాఖ్యలు చేసారు..మరోసారి తన నోటికి పని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేసారు సీఎం. ‘ఆరు నెలల్లో ప్రభుత్వం పడగొట్టి కేసీఆర్ సీఎం అవుతారని బీఆర్ఎస్ వాళ్లు అంటున్నారు. నీ అయ్య ఎవడ్రా ప్రభుత్వాన్ని పడగొట్టేటోడు. ఎవడు కొట్టేది..? మీ ఊర్ల ఎవడన్నా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే వేపచెట్టుకి కోదండం వేసి కొట్టండి. లాగులో తొండలు విడవండి’ అని రేవంత్ పిలుపునిచ్చారు.
‘కేసీఆర్ (KCR).. ఇక ఆయన ఫామ్ హౌస్ సీఎం కావాల్సిందే. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కాదు కదా.. మంత్రి కూడా కాలేరు. ఒకవేళ ఆయన సీఎం కావాలంటే నిత్యానందలా ప్రత్యేక దీవి కొనుక్కొని ముఖ్యమంత్రి కావాల్సిందే. ఆయన పాపాల భైరవుడు’ అని కేసీఆర్ ఫై ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కారణమైన రేవంత్..ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించే విధంగా ఆ బాధ్యత తన భుజాలపై వేసుకున్నారు.
పార్లమెంట్ ఎన్నికల (Lok Sabha Election 2024 ) శంఖారావాన్ని ఇంద్రవెల్లి సభ వేదికగా రేవంత్ పూరించారు. ఇదే సందర్బంగా బిఆర్ఎస్ పార్టీ ఫై నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటున్నట్లు రేవంత్ తెలిపారు. అలాగే అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటున్నామని , గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ విధ్వంసానికి గురైందన్నారు. నాగోబా ఆలయాన్ని గత ప్రభుత్వం ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 7 వేల స్టాఫ్ నర్సుల ఉద్యోగాలు ఇచ్చామని ,15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని… దీనిపై మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
తాము అధికారంలోకి వచ్చి 60 రోజులు కూడా పూర్తి కాలేదు.. అప్పుడే 6 గ్యారంటీలు పూర్తి కాలేదని కొందరు అడుగుతున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం కనీసం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలనే ఆలోచన చేసిందా? అని ప్రశ్నించారు. త్వరలోనే లక్ష మంది మహిళలకు రూ.500లకు సిలిండర్ అందజేస్తామని.. ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని సభ వేదికగా ప్రకటించారు. 200 యూనిట్ల ఉచిత్ విద్యుత్ స్కీమ్ ను కూడా ప్రారంభిస్తామని తెలిపారు. తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి ఉచిత విద్యుత్ ను అందిస్తామని తెలిపారు.
త్వరలోనే రేవంత్ సర్కార్ పడిపోతుందని, మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారంటూ బీఆర్ఎస్ నేతలు పలు సందర్భాల్లో చేస్తున్న వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ముందా అని అంటూ బీఆర్ఎస్ నేతలను రేవంత్ ప్రశ్నించారు. మూడు నెలలకో, ఆరు నెలలకో కేసీఆర్ సీఎం అవుతారని ఎవడైనా అంటే పళ్లు రాలగోడతామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఆలోచన వచ్చినోళ్లను గ్రామాల్లో తరిమి తరిమి కొట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందా అంటూ సెటైర్లు వేశారు. తమది ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం.. ప్రజా ప్రభుత్వమని రేవంత్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని భ్రమల్లో, కలలో కేసీఆర్ ఉన్నారని.. ఆయన ఖన్‌దాన్ మొత్తం వచ్చినా పండబెట్టి కొడతాం అంటూ హెచ్చరించారు.
Read Also : TTD: జనవరిలో 21.09 లక్షల మంది భక్తుల దర్శనం, తిరుమల శ్రీవారికి రూ.116.46 కోట్లు ఆదాయం