సంగారెడ్డి వేదికగా జరిగిన సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడినా, బీఆర్ఎస్ అద్భుత ప్రదర్శన చేసిందని ఆయన కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40 శాతం (4 వేలకు పైగా) సర్పంచ్ స్థానాలను గెలుచుకోవడం ద్వారా బీఆర్ఎస్ తన సత్తా చాటిందని, ఇది పార్టీ కేడర్‌లో ఉన్న పట్టుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అధికార పార్టీ 90 శాతం స్థానాలు గెలుచుకోవడం సహజమని, కానీ ఇక్కడ ప్రజలు కాంగ్రెస్ అబద్ధాలను నమ్మకుండా ప్రతిపక్షానికి పెద్దపీట వేశారని ఆయన విశ్లేషించారు.
Harishrao Cng
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును విమర్శిస్తూ, రాజకీయాల్లో అబద్ధాలు ఆడటంలో ఆయనకు ‘నోబెల్ ప్రైజ్’ ఇవ్వాలని హరీష్ రావు ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయిలో రైతులు ఎరువుల కోసం లైన్లలో నిలబడి ఇబ్బందులు పడుతుంటే, ప్రభుత్వం ‘యాప్‌లు’, ‘మ్యాప్‌ల’ పేరుతో డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో ఎరువుల లారీలు నేరుగా గ్రామాలకు వచ్చేవి అని, కానీ ఇప్పుడు రైతులు గోసపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రైతుబంధు, రుణమాఫీ వంటి పథకాలను ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి, తన మనుమడి సరదా కోసం సింగరేణి నిధులతో 100 కోట్లు ఖర్చు చేసి ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ‘రేసింగ్ సీఎం’ కాదు, ఢిల్లీకి హైదరాబాద్‌కు తిరిగే ‘ఫ్లయింగ్ సీఎం’ అని విమర్శించారు.
సర్పంచ్‌ల ప్రాముఖ్యతను వివరిస్తూ ముఖ్యమంత్రికి లేని ‘చెక్ పవర్’ కేవలం గ్రామ సర్పంచ్‌కే ఉంటుందని, ఇది రాజ్యాంగం కల్పించిన గొప్ప అధికారమని హరీష్ రావు గుర్తు చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి వస్తాయని, వీటిని ఆపడం ఎవరికీ సాధ్యం కాదని ధైర్యం చెప్పారు. ఎన్నికైన ప్రతినిధులు ప్రజలకు తలలో నాలుకలా ఉండి సేవ చేయాలని హితవు పలికారు. ప్రస్తుత సర్పంచ్‌ల ఐదేళ్ల పదవీకాలంలో మరో రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పోయి, బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి వస్తుందని, మిగిలిన మూడేళ్లు కేసీఆర్ నాయకత్వంలో పనులు పూర్తి చేసే బాధ్యత తాము తీసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
