తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మార్గ్ వద్ద గల హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ లో హైదరాబాద్ రైజింగ్ ఉత్సవాలను (Rising festival) మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న సందర్భంగా ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా రైజింగ్ ఉత్సవాలను నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భాగంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ..కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేసారు. కేంద్రం నుండి హైదరాబాద్ అభివృద్ధి కోసం అవసరమైన నిధులు తీసుకురావడంలో కిషన్ రెడ్డి విఫలమయ్యారని ఆరోపించారు. మోదీ సర్కారు నుంచి రూ. లక్షన్నర కోట్లు తెచ్చి చూపిస్తే, పది లక్షల మందితో సన్మానిస్తామని సవాల్ చేశారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం మెట్రో రైల్వే విస్తరణ, మూసీ నది సుందరీకరణకు రూ.70 వేల కోట్ల నిధులు అవసరమని సీఎం రేవంత్ వివరించారు. వీటిని సాధించడంలో కిషన్ రెడ్డి ఏమి చేస్తున్నారు అని ప్రశ్నించారు. కేవలం రాజకీయ విమర్శలకు పరిమితమయ్యే కిషన్ రెడ్డి ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.
కేంద్రం పథకాలు ప్రజలకు చేరేలా కృషి చేయాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి మీద ఉందని రేవంత్ గుర్తుచేశారు. రాష్ట్ర ప్రజలకు మోదీ సర్కారు చేస్తున్న అన్యాయాన్ని నిలదీయలేని స్థితిలో ఆయన ఉన్నారని విమర్శించారు. ప్రత్యేకంగా హైదరాబాద్ మెట్రో పనుల విషయంలో కేంద్రం పూర్తి సహకారం అందించలేదని వివరించారు. హైదరాబాద్ అభివృద్ధి రాజకీయాలపైనే ఆధారపడి ఉందని, దీని వల్ల ప్రజలు నష్టపోతున్నారని సీఎం రేవంత్ అన్నారు. పెండింగ్ నిధులు, అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన కేంద్రం స్పందన లేకపోవడం వల్ల రాష్ట్రానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాలు కంటే ప్రజల సంక్షేమం ముఖ్యం అని రేవంత్ పేర్కొన్నారు. కేంద్రంతో తగువులపై కాకుండా, రాష్ట్రం హక్కులను సాధించడంలో కిషన్ రెడ్డి తన పాత్రను సమర్థవంతంగా పోషించాలని డిమాండ్ చేశారు. అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చి ముందుకు సాగాలన్న సంకల్పాన్ని వ్యక్తం చేశారు.
Read Also : APSRTC Chairman Konakalla Narayana : APSRTC ప్రయాణికులకు శుభవార్త