తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు (Kaleshwaram Project) నిర్మించిన సంగతి తెలిసిందే. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలంలోని కన్నేపల్లి గ్రామం వద్ద గోదావరి నదిపై ఈ ప్రాజెక్ట్ ను నిర్మించారు. అయితే ఈ ప్రాజెక్ట్ వెనుక ఎన్నో అవకతవకలు జరిగాయని..ఈ ప్రాజెక్ట్ ద్వారా కేసీఆర్ ఫ్యామిలీ (KCR Family) కి పెద్ద ఎత్తున ముడుపులు అందాయని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్న తరుణంలో..ఇప్పుడు మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్ (Medigadda Lakshmi Barrage) కుంగిపోవడం ..కేసీఆర్ ప్రభుత్వాన్ని మరింత విమర్శల పలు చేస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
శనివారం రాత్రి బి-బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న వంతెన కొంతమేర కుంగింది. బ్యారేజీ 20వ పిల్లర్ కుంగడంతోనే పైన వంతెన కుంగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు… మహారాష్ట్ర- తెలంగాణ రాష్ట్రాల మధ్య బ్యారేజీ పైనుంచి రాకపోకలు నిలిపివేశారు. బ్యారేజీ సమీప ప్రాంతంలోకి ప్రజలను రాకుండా పూర్తిగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసారు. ఈ ఘటన పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందించారు.
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగమైన లక్ష్మీ బ్యారేజ్ వద్ద పిల్లర్ కుంగిపోవడానికి కారణం కేసీఆర్ కుటుంబమేనని ఆరోపించారు. కాళేశ్వరం అవినీతిలో మొదటి దోషి కేసీఆర్ కుటుంబం అని విమర్శించారు. నాణ్యతా లోపంతోనే మేడిగడ్డ ప్రమాదం చోటు చేసుకుందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.1 లక్ష కోట్లను కేసీఆర్, కాంట్రాక్టర్లు దోచుకున్నారని రేవంత్ మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంపై సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ తో దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని వెల్లడించారు. మేడిగడ్డ ఘటనపై కేంద్ర హోంమంత్రి, గవర్నర్, ఈసీ విచారణకు ఆదేశించాలని కోరారు.