Dharani Portal: భూసమస్యలకు చెక్ పెట్టేందుకు తీసుకొచ్చిన ధరణి పోర్టల్ తీవ్ర వివాదంలో చిక్కుకుంది. సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ధరణిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
ధరణి పోర్టల్‌పై బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ దుమారం రేగుతుంది. ధరణి పోర్టల్‌ను ఉపయోగించుకుని అధికార పార్టీ నేతల అండతో కొందరు భూఅక్రమాలకు పాల్పడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం వద్ద ఉండాల్సిన రెవెన్యూ రికార్డు పోర్టల్ ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ చేతుల్లోకి ఎందుకు వెళ్లిందని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. 90 వేల కోట్ల మేర బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన కంపెనీతో ప్రభుత్వం ఎలా ఒప్పందం చేసుకుంటుందని ప్రశ్నించారు. ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ తరపున ధరణి పోర్టల్‌ను నిర్వహిస్తున్న టెరాసిస్ టెక్నాలజీస్ 52.26 శాతం వాటాను ఫిలిప్పీన్స్‌కు చెందిన కంపెనీకి రూ.1,275 కోట్లకు విక్రయించిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ధరణి పోర్టల్ నిర్వహణ పూర్తిగా శ్రీధర్ రాజు చేతుల్లోకి వెళ్లిందన్నారు రేవంత్. ఇ-ధరణి పోర్టల్ భూముల లావాదేవీలకు సంబంధించిన అన్ని రుసుములు నేరుగా శ్రీధర్ రాజు నిర్వహిస్తున్న కంపెనీకి వెళుతున్నాయి. ధరణి పోర్టల్‌లో రూ.50,000 కోట్ల విలువైన 25 లక్షల భూ లావాదేవీలు జరిగినట్లు అంచనా వేస్తున్నట్లు రేవంత్ అన్నారు. ధరణి పోర్టల్‌లో జరిగిన 25 లక్షల లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ జరగాలని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ధరణిపై సమగ్ర విచారణ దర్యాప్తు సంస్థలతో జరిపించాలని ఆయన భావిస్తున్నారు. ఈ విషయంలో అవసరమైతే కోర్టుకు వెళతానని స్పష్టం చేశారు రేవంత్.
ధరణి అనేది ముందుగా 2010 లో ఒరిస్సాలో మొదలు పెట్టారని, కానీ ధరణి కెసిఆర్ నిర్ణయంగా చెప్పుకుంటున్నట్లు రేవంత్ రెడ్డి చురకలంటించారు. కాగా ధరణి పోర్టల్ నిర్వహణను కేంద్ర పర్యవేక్షణలో ఉన్న నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసి)కి అప్పగించాలని కాగ్ తన నివేదికలో సూచించింది.ఇదిలా ఉండగా ధరణిపై వస్తున్న ఆరోపణలను సీఎం కెసిఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ధరణి పోర్టల్‌ను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో బంగాళాఖాతంలో ముంచుతామని ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు.
Read More: Adipurush: నేపాల్‌లో ఆదిపురుష్ సినిమాపై వివాదం.. మార్నింగ్ షోలు నిలిపివేత..?