Site icon HashtagU Telugu

SLBC : ఉత్తమ్ కుమార్ సలహాలతో ముందుకు వెళ్తాము – సీఎం రేవంత్

Uttam Revanth

Uttam Revanth

శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) టన్నెల్ ప్రాజెక్టు ఆలస్యం, అవినీతి, సాంకేతిక లోపాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. గత ఫిబ్రవరి 22న జరిగిన టన్నెల్ కూలిన ఘటనను గుర్తుచేసుకుంటూ, ఈ విషాదానికి పరోక్షంగా మాజీ సీఎం కేసీఆర్ మరియు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందిగా ఆయన పేర్కొన్నారు. ఆ సమయంలో కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు రాకపోవడంతో పనులను ఉద్దేశపూర్వకంగా ఆపేశారని ఆరోపించారు. ఫలితంగా ప్రాజెక్టు దశాబ్దకాలం ఆలస్యమై, కార్మికుల ప్రాణాలు బలైపోయాయని అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని మన్నెవారిపల్లి వద్ద టన్నెల్ ప్రాజెక్టును ఆకస్మికంగా పరిశీలించిన సీఎం రేవంత్, ప్రాజెక్టు పనులపై అధికారులు సమగ్ర వివరాలు అందించాలని ఆదేశించారు.

New Rules : ఏపీ ప్రజలు తప్పక తెలుసుకోవాల్సిన రూల్స్..లేదంటే పథకాలు కట్

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ (NGRI) ఆధ్వర్యంలో జరుగుతున్న ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ హెలిబోర్న్ మాగ్నెటిక్ సర్వే ద్వారా భూగర్భంలో వెయ్యి మీటర్ల లోతులో ఉన్న షియర్ జోన్లు, నీటి ప్రవాహ దిశలు, మట్టి సాంద్రత తదితర వివరాలను గుర్తించవచ్చని అధికారులు తెలిపారు. సీఎం మాట్లాడుతూ.. గతంలో రూ.2 వేల కోట్లతో పూర్తయ్యే ఈ ప్రాజెక్టు, దశాబ్ద కాలం నిర్లక్ష్యంతో ఇప్పుడు రూ.4,600 కోట్లకు చేరిందన్నారు. అయినప్పటికీ 4 వేల క్యూసెక్కుల నీటిని గ్రావిటీ ద్వారా నల్గొండ జిల్లాకు తరలించేలా ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం సమయానుకూలంగా పూర్తి చేస్తుందని హామీ ఇచ్చారు.

“ఇప్పటి టెక్నాలజీ 20 ఏళ్ల కిందటి దానికంటే ఎన్నో రెట్లు అభివృద్ధి చెందింది. అప్పట్లో ఉపయోగించిన టన్నెల్ బోరింగ్ యంత్రాలు ఇప్పుడు పనికిరావు. కాబట్టి కొత్త సాంకేతికతను ఉపయోగించి మిగిలిన 9.88 కిలోమీటర్ల టన్నెల్‌ను పూర్తి చేయనున్నాం” అని తెలిపారు. మాజీ ఆర్మీ అధికారి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుభవం ఈ పనుల్లో ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా SLBC టన్నెల్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక దేశంలోనే అత్యుత్తమ ఇంజినీరింగ్‌ ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.

 

Exit mobile version