Maoists Letter : మావోయిస్టు పార్టీ కీలక నేతలు రేణుక అలియాస్ చైతే (55), సుధీర్‌లది బూటకపు ఎన్‌కౌంటర్ అని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆ ఇద్దరిని ఇంద్రావతి నది వద్ద భద్రతా బలగాలు పట్టుకొని, హింసించి హత్య చేశారని పేర్కొంది. 35 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో ఇద్దరూ కీలక పాత్ర పోషించారని మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ పేరుతో ఒక లేఖ విడుదలైంది. దంతెవాడ – బీజాపూర్ సరిహద్దుల్లో మార్చి 31న జరిగిన ఎన్‌కౌంటర్ పక్కా బూటకపు ఎన్‌కౌంటర్ అని లేఖలో ప్రస్తావించారు. ఆదివాసీలు, విప్లవకారులపై ఈ నర సంహారాన్ని వెంటనే ఆపాలని పిలుపునిచ్చారు.
Also Read :Maoists Peace Talks: శాంతి చర్చలకు సిద్ధమైన మావోయిస్టులు.. కేంద్రం ఏం చేయబోతోంది ?
ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ఇంటెలీజెన్స్ అధికారులు..
‘‘కామ్రేడ్ చైతే అనారోగ్యం బారినపడింది. ఆమె బీజాపూర్ జిల్లా భైరంగఢ్ బ్లాక్‌లోని బెల్నార్ గ్రామంలో ఉన్న ఒక ఇంట్లో ఉందని తెలియడంతో.. పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. ఈ ఘటన మార్చి 31న తెల్లవారుజామున 4 గంటలకు చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు కామ్రేడ్ చైతేను అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన చోటే, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల ఇంటెలీజెన్స్ విభాగం అధికారులు 2 నుంచి మూడు గంటల పాటు ఆమెను విచారించారు. అనంతరం ఆమెను ఇంద్రావతి నదీ తీరానికి తీసుకెళ్లి చంపారు. అక్కడ ఒక ఇన్సాస్ రైఫిల్ లభించిందని చెప్పడం అబద్ధం’’ అని మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ(Maoists Letter) పేర్కొంది.
Also Read :Nagababu : ఎమ్మెల్సీగా ప్రమాణం చేసాక మొదటిసారి పవన్ ని కలిసిన నాగబాబు.. ఫోటోలు వైరల్..
రేణుక నేపథ్యం ఇదీ..
మావోయిస్టు పార్టీ కీలక నేత రేణుక అలియాస్ చైతే జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండిలో జన్మించారు. ఆమె పూర్తి పేరు గుమ్మడవెల్లి రేణుక . ఆమెను మావోయిస్టులు భాను, చైతీ, సరస్వతి అనే వివిధ పేర్లతో పిలిచేవారు. ఈమె కడవెండికి చెందిన గుమ్మడవెల్లి సోమయ్య- జయమ్మ దంపతుల కుమార్తె. రేణుక అన్న గుమ్మడవెల్లి వెంకటకృష్ణప్రసాద్ మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకుడిగా పనిచేసి లొంగిపోయారు. 1996లో రేణుక మావోయిస్టు పార్టీలో చేరారు. అలిపిరిలో చంద్రబాబు బాంబ్ బ్లాస్ట్ ఘటన అనంతరం మావోయిస్టులపై నిర్బంధం పెరగడంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రేణుక 2005లో సెంట్రల్ కమిటీ సభ్యుడు శాఖమూరి అప్పారావును వివాహం చేసుకున్నారు. ఆయన 2010లో నల్లమలలో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందారు.