KCR Delhi Tour Secret : కేసీఆర్ ఢిల్లీ కోట ర‌హ‌స్యం.!

తెలంగాణ సీఎం కేసీఆర్ మూడు నెల‌ల్లో మూడుసార్లు ఢిల్లీ వెళ్లి వ‌చ్చాడు. ఒక‌సారి నెల రోజులు అక్క‌డే ఉన్నాడు.

  • Written By:
  • Updated On - November 26, 2021 / 03:16 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ మూడు నెల‌ల్లో మూడుసార్లు ఢిల్లీ వెళ్లి వ‌చ్చాడు. ఒక‌సారి నెల రోజులు అక్క‌డే ఉన్నాడు. ఇంకోసారి వారం రోజుల పాటు హ‌స్తిన‌లో గ‌డిపాడు. తాజాగా మూడు రోజులు దేశ రాజ‌ధానికి వెళ్లాడు..వ‌చ్చాడు. ఈ మూడుసార్లు ఆయ‌న అక్క‌డ ఏం చేశాడ‌ని ప్ర‌శ్నించుకుంటే స్ప‌ష్ట‌మైన స‌మాధానం ల‌భించ‌దు. ఆయుష్మాన్ భ‌వ‌, కిసాన్ స‌మ్మాన్ యోజ‌న‌, వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై సీరియ‌స్ గా చ‌ర్చ జ‌రుగుతోన్న స‌మయంలో నెల రోజుల పాటు ఢిల్లీలో ఉన్నాడు. తిరిగి వ‌చ్చిన వెంట‌నే కేంద్రం తీసుకున్న ఆ మూడు విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల‌కు రాష్ట్రంలో జై కొట్టాడు కేసీఆర్.

Also Read : కవిత ఆస్తులు మూడేళ్లలో మూడురెట్లు పెరిగాయి!

రెండోసారి వారం రోజులు ఢిల్లీకి వెళ్లి వ‌చ్చిన తరువాత ర‌హ‌స్య ఎజెండా ఆల‌స్యంగా వెలుగు చూసింది. ఉప రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి కోసం పైర‌వీలు చేశాడ‌ని సోష‌ల్ మీడియాలో వార్త క‌థ‌నాలు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం ఉప ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఉన్న వెంక‌య్యనాయుడు స్థానంలో ద‌క్షిణ భార‌త‌దేశం నుంచి కేసీఆర్ పేరును ప‌రిశీలిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. రాష్ట్రంలో కేటీఆర్ ను సీఎంగా చేసి ఢిల్లీ వైపు కేసీఆర్ వెళ్లడానికి ప్లాన్ చేశాడ‌ని పార్టీ వ‌ర్గాల్లోనూ చ‌ర్చకు దారితీసింది. ఎన్టీయేలో టీఆర్ ఎస్ భాగ‌స్వామి కాబోతుంద‌ని బ‌లంగా వినిపించింది. హుజారాబాద్ ఉప ఎన్నిక వ‌చ్చిన తరువాత బీజేపీ, టీఆర్ఎస్ క్షేత్ర‌స్థాయిలో ఢీ కొట్టాయి. ఆ క్ర‌మంలో ఇరు పార్టీల మ‌ధ్య వైరం పెరిగింది. ఫ‌లితాలు ప్ర‌తికూలంగా రావ‌డంతో వ‌రి ధాన్యం కొనుగోలు అంశంపై మోడీకి వ్య‌తిరేకంగా ఫైట్ చేస్తాన‌ని కేసీఆర్ ప్ర‌క‌టించాడు. బీజేపీపై యుద్ధాన్ని ప్ర‌క‌టించాడు. మునుపెన్న‌డూ లేని విధంగా ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు, రాష్ట్రంలోని బీజేపీ నేత‌ల‌ను ఆయ‌న టార్గెట్ చేశాడు. దీంతో ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి కోసం కేసీఆర్ పైర‌వీలు చేశాడ‌ని వ‌చ్చిన ప్ర‌చారానికి తాత్కాలికంగా తెర‌ప‌డింది.

Also Read : కేసీఆర్ పై మమత ఎఫెక్ట్

వ‌రి ధాన్యం కొనుగోలుపై తాడోపేడో తేల్చుకుంటాన‌ని కేసీఆర్ తాజాగా ఢిల్లీ వెళ్లాడు..వ‌చ్చాడు. అవ‌స‌ర‌మైతే, జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ధ‌ర్నా చేస్తాన‌ని హెచ్చ‌రిక కూడా చేశాడు. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతోన్న తికాయ‌త్ మ‌ద్ధ‌తును తీసుకోవాల‌ని కూడా భావించాడు. కానీ, సైలెంట్ గా తెలంగాణ‌కు తిరిగి వ‌చ్చాడు కేసీఆర్. ఆయ‌న హైద‌రాబాద్‌కు చేరుకున్న వెంట‌నే రైతు నాయ‌కుడు తికాయ‌త్ తీవ్ర‌మైన కామెంట్లు టీఆర్ఎస్ పార్టీ మీద చేశాడు. బీజేపీకి బీ టీంగా టీఆర్ఎస్ పార్టీ ఉంద‌ని తేల్చాసేశాడు.ఇదంతా ఒక ఎత్తు అయితే, ప్ర‌ధాన మంత్రి మోడీ అపాయిట్మెంట్ ను కేసీఆర్ కోర‌లేద‌ని పీఎంవో స్ప‌ష్టం చేసింది. మోడీని క‌ల‌వ‌డానికి కూడా ప్ర‌య‌త్నం చేయ‌లేద‌ని తేల్చేసింది. సాధార‌ణంగా ఎవ‌రైనా ప్ర‌ధాని మంత్రిని క‌ల‌వ‌డానికి ముందుగా రాత‌పూర్వ‌క విజ్ఞ‌ప్తి చేయాలి. ఆ త‌రువాత ప్రాధాన్య‌తా క్ర‌మం, స‌బ్జెట్ ఆధారంగా అపాయిట్మెంట్ ను పీఎంవో ఫిక్స్ చేస్తోంది. ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ రాత‌పూర్వ‌కంగా ఎలాంటి విజ్ఞ‌ప్తి చేయ‌లేద‌ని పీఎంవో కార్యాల‌యం స్ప‌ష్టం చేసింది. సో..వ‌రి ధాన్యం విష‌యంలో కేసీఆర్ ఢిల్లీలో ఆడిన గేమ్ బ‌య‌ట ప‌డింది. ఇందిరా పార్క్ వ‌ద్ద ఒక రోజు ధ‌ర్నాకు దిగిన కేసీఆర్ రైతుల కోసం ఉద్య‌మిస్తాన‌ని శ‌ప‌థం చేశాడు. కేంద్రం మెడ‌లు వంచైన చివ‌రి గింజ వ‌ర‌కు కొనుగోలు చేస్తామ‌ని హామీ ఇచ్చాడు. బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయ‌లేమని చెప్పిన కేంద్రం ముడి ధాన్యం కొంటామ‌ని చెప్పింది. దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ కేంద్ర నిర్ణ‌యంపై వ్య‌తిరేక‌త లేదు.తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మోడీ స‌ర్కార్ నిర్ణ‌యంపై కేసీఆర్ ధ్వ‌జ‌మెత్తాడు. అందుకు ప్ర‌తిగా బాయిల్డ్‌, ముడి రైస్ కొనుగోళ్ల వెనుక ఉన్న భాగోతాన్ని బీజేపీ బ‌య‌ట పెట్టింది. బాయిల్డ్ రైస్ రూపంలో ఏడేళ్లుగా సుమారు 12వేల కోట్లు ప‌క్క‌దోవ ప‌ట్టించార‌ని టీఆర్ఎస్ నేత‌ల‌పై దుమ్మెత్తి పోసింది. విచార‌ణకు సిద్ధం కావాల‌ని తెలంగాణ బీజేపీ స‌వాల్ చేసింది. ఆ క్ర‌మంలో ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ ఏదో తేల్చుకుంటాడ‌ని చాలా మంది అనుకున్నారు. కానీ, మోడీని క‌ల‌వ‌కుండానే వెనుతిర‌గ‌డం వెనుక రూ.12కోట్ల భాగోతం ఉంద‌ని బీజేపీ స‌రికొత్త అస్త్రాన్ని బ‌య‌ట‌కు తీసింది. దీనికి ప్ర‌తిగా గులాబీ ద‌ళం ఎలాంటి అస్త్రాన్ని త‌యారు చేస్తుందో చూడాలి.