హైదరాబాద్(Hyderabad)లో ఇటీవల ఎంఎంటీఎస్ రైలు(MMTS Train)లో జరిగిన దారుణ ఘటన దక్షిణ మధ్య రైల్వేను అప్రమత్తం చేసింది. రైల్వే శాఖ మహిళల భద్రత(Railway Department Women Safety)ను పెంపొందించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రత్యేకంగా, ఎంఎంటీఎస్ రైళ్లలో పానిక్ మోడ్ బటన్(Panic mode button)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మహిళలు అత్యవసర పరిస్థితుల్లో ఈ బటన్‌ను నొక్కిన వెంటనే రైల్వే పోలీసులు అప్రమత్తమై తక్షణ సహాయం అందించేలా చర్యలు తీసుకుంటారు. అలాగే, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) అధికారులు రైళ్లలో సైతం పెట్రోలింగ్ నిర్వహించి మహిళా ప్రయాణికుల భద్రతను పర్యవేక్షిస్తారు.
KTR : నల్గొండ జిల్లాలో కేటీఆర్‌పై రెండు కేసులు.. ఎందుకంటే.. ?
అలాగే తాజాగా ఎంఎంటీఎస్ రైల్లో జరిగిన లైంగిక దాడి యత్నం ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. బాధితురాలు మొదట ఫోటో ఆధారంగా నిందితుడిని గుర్తించినప్పటికీ, ప్రత్యక్షంగా చూసిన తర్వాత అతడు కాదని స్పష్టం చేయడంతో, పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నిందితుడు ఎక్కడ ఎక్కి, ఎక్కడ దిగాడనే విషయంపై స్పష్టత లేకపోవడంతో పోలీసులు మార్గంలోని అన్ని రైల్వే స్టేషన్లలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు 150కి పైగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన అధికారులు త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని తెలిపారు. దాడి నుంచి తప్పించుకోవడానికి బాధిత యువతి రైలు నుంచి దూకడం వల్ల తీవ్ర గాయాల పాలైంది. ఆమెకు దవడ, కాలు విరిగిపోయాయి. దీంతో శస్త్రచికిత్సలు అవసరమయ్యాయి. వైద్యులు ఆమెకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఈ ఘటన పునరావృతం కాకుండా రైల్వే శాఖ ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటోంది. ఎంఎంటీఎస్ రైళ్లలో మరింత భద్రతా ఏర్పాట్లు చేయాలని, ప్రతి రైలులో రైల్వే పోలీస్ అధికారిని నియమించాలని నిర్ణయం తీసుకుంది. రైల్వే స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలను మరింత సమర్థంగా ఉపయోగించేందుకు రైల్వే శాఖ కృషి చేస్తోంది.