Site icon HashtagU Telugu

Rahul Gandhi: కేసీఆర్ అవినీతి చిట్టా మోడీ చేతుల్లో!

Congress Party Jana Garjana Meeting Today In Khammam Rahul Gandhi Is Chief Guest

Congress Party Jana Garjana Meeting Today In Khammam Rahul Gandhi Is Chief Guest

Rahul Gandhi: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయాక తెలంగాణకు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆయన అనేక సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులు, హామీలు ఇస్తూ వస్తున్నారు. అయితే కేసీఆర్ అనేక పథకాల్లో అవినీతి దాగి ఉందని విమర్శించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. నిన్న ఆదివారం జూలై 2న తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అవినీతి తతంగాన్ని బట్టబయలు చేశారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాల్లో కేసీఆర్ అవినీతి ఏరులైపారుతుందన్నారు రాహుల్ గాంధీ. కేసీఆర్ అవినీతి చిట్టా మోడీ చేతుల్లో ఉందన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాములో జరిగిన అవినీతి అంతా దర్యాప్తు సంస్థలకు తెలుసునని చెప్పారు. అయితే కేసీఆర్ అవినీతికి పాల్పడుతున్నాడని మోడీకీ తెలిసినా పట్టించుకోడని అన్నారు. ఎందుకంటే కేసీఆర్ మోడీ రిస్తెదర్ అని హాట్ కామెంట్స్ చేశారు రాహుల్. ఇక ఇటీవల కర్ణాటక ఫలితాల్లో కాంగ్రెస్ ప్రభంజనం గురించి మాట్లాడారు. కర్ణాటక ఫలితాలు తెలంగాణాలో పునరావృతం అవుతాయని చెప్పారు. అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఎలా అయితే పార్టీకోసం శ్రమించారో తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సంసిద్ధంగా ఉండాలని కోరారు రాహుల్. ముఖ్యంగా ఖమ్మం కాంగ్రెస్ కంచుకోట అని, ఎన్ని సమస్యలు వచ్చినా ఖమ్మం కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పార్టీని వీడలేదని, ఖమ్మం కాంగ్రెస్ నాయకుల రక్తంలో కాంగ్రెస్ ఉన్నదని ఎన్నోసార్లు నీరుపించారని పేర్కొన్నారు రాహుల్ గాంధీ.

కాంగ్రెస్ కోసం అహర్నిశలు కష్టపడుతున్న ప్రతిఒక్కరికి ధన్యవాదాలు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు 1300 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన భట్టివిక్రమార్కకి ధన్యవాదాలు తెలిపారు రాహుల్. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించారు. ఇక కాంగ్రెస్ విధానాలు నచ్చి కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాహుల్ అనేక విషయాలపై స్పష్టంగా మాట్లాడారు. వరంగల్ లో రైతు డిక్లరేషన్, హైదరాబాద్ లో యూత్ డిక్లరేషన్ కి మేము కట్టుబడి ఉన్నామని అన్నారు రాహుల్. ఈ సందర్భంగా వృద్దులకు, వితంతువులకు 4000 పెన్షన్ ని ప్రకటించారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై రాహుల్ నిప్పులు చెరిగారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్ల అవినీతి జరిగింది. ధరణి పోర్టల్ పేరుతో అవినీతికి పాల్పడ్డాడు అంటూ కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పేదప్రజలకు ఇందిరాగాంధీ హయాంలో ఇచ్చిన భూముల్ని కెసిఆర్ లాక్కున్నాడని ఆరోపించారు రాహుల్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు చెందాల్సిన భూములు వారికీ కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఇక గతంలో బీజేపీ తీసుకొచ్చిన సాగు చట్టాలను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించిందని, అయితే కెసిఆర్ మాత్రం వాటికీ మద్దతు తెలిపారని చెప్పారు రాహుల్. ఎందుకంటే కెసిఆర్ రిమోట్ మోడీ వద్ద ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కెసిఆర్ అవినీతి చిట్టా అంతా మోడీ చేతుల్లో ఉన్నప్పటికీ ఎలాంటి చర్యలు ఉండవని స్పష్టం చేశారు. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ బీ టీమ్. కెసిఆర్ బీజేపీ బంధువు అంటూ సీఎం కెసిఆర్ పై నిప్పులు చెరిగారు రాహుల్ గాంధీ.

Read More: Rahul Gandhi: ఏపీకి ప్రత్యేక హోదా నా బాధ్యత.. రాజధాని అమరావతే!